Budget 2025: విమానయానం రంగానికి పెద్ద ప్రకటనలు వస్తాయా ? అంచనాలు ఎలా ఉన్నాయి ?
Budget 2025: దేశ సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో కీలక మార్పులు చేపట్టే అవకాశముంది.
Budget 2025: విమానయానం రంగానికి పెద్ద ప్రకటనలు వస్తాయా ? అంచనాలు ఎలా ఉన్నాయి ?
Budget 2025: దేశ సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో కీలక మార్పులు చేపట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో విమానయాన రంగం కూడా ప్రభుత్వం నుంచి అనేక ఆకాంక్షలు పెట్టుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో పెద్దగా మార్పులు జరగలేదు. ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటూ వస్తోంది. ఈసారి బడ్జెట్‌లో కేంద్రం విమానయాన రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విమానయాన రంగంలో ప్రధాన సమస్యలు
విమానయాన రంగం ప్రస్తుతం అనేక కీలక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనలో దారుణమైన లోటు, భద్రతా పరమైన సమస్యలు, విదేశీ సేవలపై అధికంగా ఆధారపడటం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, భారతదేశంలో కేవలం 149 విమానాశ్రయాలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. దేశ జనాభా దృష్ట్యా ఇది తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.
అనేక టైర్-2, టైర్-3 నగరాల్లో ఇప్పటికీ విమానాశ్రయాల కొరత ఉంది. ఉన్న కొన్ని విమానాశ్రయాలు పాతవే కావడంతో రన్‌వే, ప్రయాణీకుల కోసం అవసరమైన సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెందలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరిగే కొద్దీ, ఈ మౌలిక లోపాల కారణంగా విమానాశ్రయాల సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు.
భారీ నష్టాల్లో దేశీయ విమానయాన రంగం
ICRA నివేదిక ప్రకారం, భారతీయ విమానయాన రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000-3,000 కోట్ల నికర నష్టాన్ని చవిచూడవచ్చని అంచనా.. కరోనా తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విమానయాన సంస్థలు తిరిగి గాడిన పడుతున్నప్పటికీ, నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరలు, నిధుల కొరత కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
బడ్జెట్ 2025లో ఏం మార్పులు రావచ్చు?
ఈ నేపథ్యంలో, బడ్జెట్ 2025 లో విమానయాన రంగానికి మరిన్ని నిధులను కేటాయించాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, టైర్-2, టైర్-3 నగరాల్లో మౌలిక సదుపాయాల పెంపు, విమానయాన భద్రతా చర్యలకు మరింత బలం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, విమానయాన సంస్థలపై పన్నుల తగ్గింపు, ఇంధన వ్యయ నియంత్రణ వంటి విధాన మార్పులు రావొచ్చని అంచనా. ఇక కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఈ రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందనేది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.