Home Loan: 2026లో కొత్త ఇల్లు కొనాలనే ప్లాన్‎లో ఉన్నారా? అయితే హోంలోన్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Home Loan: 2026లో కొత్త ఇల్లు కొనాలనే ప్లాన్‎లో ఉన్నారా? అయితే హోంలోన్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Update: 2025-12-26 05:42 GMT

Home Loan: 2026లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి జీవితంలో ఒక కీలకమైన ముందడుగు వేయాలని భావిస్తున్నారా? సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే హోమ్ లోన్ ఒక ప్రధాన సాధనం అని చెప్పాలి. సరైన ప్రణాళిక లేకుండా లోన్ తీసుకుంటే ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే హోమ్ లోన్ అప్లై చేసే ముందు.. అలాగే దరఖాస్తు సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.

ముందుగా.. హోమ్ లోన్‌కు అర్హత పొందాలంటే మీ క్రెడిట్ స్కోర్ దే కీలక పాత్ర. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి. స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే లోన్ ఆమోదం ఆలస్యం కావచ్చు లేదా అధిక వడ్డీ విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న లోన్ల EMIలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవచ్చు.

డౌన్ పేమెంట్ మరో కీలకమైన అంశం. సాధారణంగా బ్యాంకులు ఆస్తి విలువలో సుమారు 75 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోన్ ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని మీరు డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఉదాహరణకు.. రూ.30 లక్షల విలువైన ఇల్లు కొనుగోలు చేస్తే కనీసం రూ.6 లక్షలు మీ వద్ద ఉండాలి. మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. లోన్ మొత్తం తగ్గుతుంది. దాంతో నెలవారీ EMI కూడా తక్కువగా ఉంటుంది.

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో కేవలం ఫ్లాట్ ధరనే కాకుండా ఇతర ఖర్చులను కూడా ముందుగానే లెక్కలోకి తీసుకోవాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ (వర్తిస్తే), లోన్ ప్రాసెసింగ్ ఫీజు, ఇంటీరియర్ లేదా మెయింటెనెన్స్ డిపాజిట్ వంటి అదనపు వ్యయాలు మొత్తం బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్లాన్ చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

లోన్ దరఖాస్తు చేసే సమయంలో వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ చార్జీలను పోల్చి చూసుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఒక చిన్న తేడా కూడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. అదే విధంగా.. మీ ఆదాయాన్ని బట్టి EMI, లోన్ కాలపరిమితిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. సాధారణంగా నెలవారీ EMI మీ నెల ఆదాయంలో 35 నుంచి 40 శాతం మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇతర అవసరాలకు సరిపడా డబ్బు మిగులుతుంది.

చివరిగా.. లోన్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులపై లోన్ భారం పడకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. సరైన ప్రణాళికతో హోమ్ లోన్ తీసుకుంటే, సొంతింటి కల ఆనందంగా, భద్రంగా నెరవేరుతుంది.

Tags:    

Similar News