Unified Pension Scheme : పెన్షన్ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: UPS గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Unified Pension Scheme : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించేందుకు కొన్ని రోజుల ముందు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) పై అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త స్కీమ్ 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. యూపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ (OPS),జాతీయ పెన్షన్ స్కీమ్ (NPS) ల మధ్య సమతుల్యతను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత హామీ పింఛన్ కల్పించేందుకు రూపొందించబడింది.
యూపీఎస్ అమలు నిబంధనలు
యూపీఎస్ కేవలం ఎన్పీఎస్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు లేదా భవిష్యత్ ఉద్యోగులు ఎన్ పీఎస్ ను కొనసాగించాలా, లేక యూపీఎస్ ను ఎంచుకోవాలా అన్నది స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. అయితే, యూపీఎస్ ను ఎంచుకున్నవారు ఇతర పింఛన్ స్కీమ్స్‌లో ఉన్న విధంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందలేరు.
పెన్షన్ లెక్కింపు విధానం
25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసిన ఉద్యోగులకు చివరి 12 నెలల సగటు బేసిక్ సాలరీలో 50శాతం పింఛన్ అందుతుంది. 25 ఏళ్ల కంటే తక్కువ సర్వీస్ చేసిన ఉద్యోగులకు వారి పనికాలాన్ని అనుసరించి పెన్షన్ లభిస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీసు చేసిన ఉద్యోగులకు నెలకు రూ. 10,000 గ్యారంటీడ్ పెన్షన్ లభిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు DA (Dearness Allowance) పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెరుగుతుంది. అదే విధంగా ఉద్యోగి మరణించినట్లయితే, అతని కుటుంబానికి ఉద్యోగి పెన్షన్‌లో 60శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. అంతే కాకుండా, ఉద్యోగ విరమణ సమయంలో గ్రాట్యుటీ, లంప్-సమ్ అమౌంట్ కూడా అందించనున్నారు.
యూపీఎస్ పై పెన్షన్ సంఘాల నిరసనలు
ఒల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం పనిచేస్తున్న "నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్" సంస్థ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. సంఘం అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ఆక్షేపించారు. ముఖ్యంగా, 25 ఏళ్ల సర్వీస్ లాక్-ఇన్ కాలాన్ని 20 సంవత్సరాలకు తగ్గించాలని ఉద్యోగుల డిమాండ్ ఉంది.
ఉద్యోగుల డిమాండ్లు
* పెన్షన్ కోసం లాక్-ఇన్ కాలం 25 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు తగ్గించాలి.
* NPS, OPS మాదిరిగానే వాలంటరీ రిటైర్మెంట్ అనుమతించాలి.
* VRS తీసుకున్నవారికి వెంటనే పెన్షన్ అందేలా చేయాలి.
* ఒకేసారి ఇచ్చే లంప్-సమ్ అమౌంట్‌కు బదులుగా, ఉద్యోగి చేసిన కాంట్రిబ్యూషన్‌తో పాటు వడ్డీ మొత్తం తిరిగి ఇవ్వాలి.
కొన్ని కీలకమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం UPS గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల పెన్షన్ సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నిర్ణయం ఉద్యోగులకు నష్టం చేస్తుందని, ప్రభుత్వం బడ్జెట్‌కు ముందు తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త పింఛన్ విధానం ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ భద్రతను ఎంతవరకు సమర్థంగా కాపాడగలదో చూడాలి. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను సమీక్షించి మరిన్ని మార్పులు చేస్తుందా? లేదా, ఇప్పుడు ప్రకటించిన UPS అమలులోకి వస్తుందా అన్నది చూడాలి.