Hyderabad Real Estate: మధ్యతరగతి కుటుంబాలకు బంపర్ ఆఫర్.. గచ్చిబౌలిలో రూ. 36 లక్షలకే ఫ్లాట్.. ఇలా అప్లై చేసుకోండి..!!
Hyderabad Real Estate: మధ్యతరగతి కుటుంబాలకు బంపర్ ఆఫర్.. గచ్చిబౌలిలో రూ. 36 లక్షలకే ఫ్లాట్.. ఇలా అప్లై చేసుకోండి..!!
Hyderabad Real Estate: ప్రతిఒక్కరికీ సొంత ఇంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవాలనే ఆశతో చాలామంది ఏళ్ల పాటు పొదుపు చేస్తూ.. ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న రియల్ ఎస్టేట్ ధరల కారణంగా.. మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో.. భాగ్యనగరంలోని మధ్య తరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు.. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి వర్గాల కోసం శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్ నగరాల్లో హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లలోని సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మొత్తం 339 ఫ్లాట్లను అమ్మకానికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్లు ఉన్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫ్లాట్లు అందుబాటులోకి రావడం మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆకర్షణీయంగా మారింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల ధరలను రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే ఇవి తక్కువ ధరలే కావడం విశేషం. ఈ ఫ్లాట్ల కోసం ఆన్‌లైన్ విధానం ద్వారా లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశించారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షలు (నెలకు రూ.50,000) లోపు ఉన్న వారు మాత్రమే ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో టోకెన్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం పూర్తిగా రిఫండబుల్ కావడం మరో ముఖ్యమైన అంశం.
దరఖాస్తుల స్వీకరణకు జనవరి 3 చివరి తేదీగా నిర్ణయించారు. గచ్చిబౌలి ఫ్లాట్లకు జనవరి 6న డ్రా నిర్వహించనుండగా, వరంగల్ ఫ్లాట్లకు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్లకు జనవరి 10న డ్రా తీయనున్నారు. ఈ పథకం ద్వారా మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు మరింత దగ్గరయ్యాయని చెప్పవచ్చు.