Fiberbond CEO: ఇలాంటి CEOని ఎప్పుడైనా చూశారా? తన కంపెనీ అమ్మేసి ఉద్యోగులకు రూ.2,000కోట్లు బోనస్ ఇచ్చిన బాస్..!!
Fiberbond CEO: ఇలాంటి CEOని ఎప్పుడైనా చూశారా? తన కంపెనీ అమ్మేసి ఉద్యోగులకు రూ.2,000కోట్లు బోనస్ ఇచ్చిన బాస్..!!
Fiberbond CEO: ఉద్యోగులకు పండుగల వేళ.. బహుమతులు లేదా చిన్న బోనస్‌లు ఇవ్వడం సాధారణమే. కానీ ఈ క్రిస్మస్‌కు ఒక కంపెనీ సీఈఓ ఇచ్చిన బహుమతి మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా రూ. 2,000 కోట్ల బోనస్‌ను తన ఉద్యోగుల కోసం కేటాయించి, కార్పొరేట్ ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఈ బోనస్ దాదాపు 540 మంది ఉద్యోగులకు అందేలా నిర్ణయించారు. ఇంతకీ ఆ కంపెనీ ఏది? ఆ సీఈఓ ఎవరు? వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం ఉన్న ఫైబర్‌బాండ్ (Fibrebond) అనే నిర్మాణ రంగ సంస్థకు గ్రాహమ్ వాకర్ సీఈఓగా ఉన్నారు. ఈ సంస్థను ఆయన తండ్రి క్లాడ్ వాకర్ 1982లో స్థాపించారు. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ కంపెనీని గ్రాహమ్ వాకర్ ఇటీవల 1.7 బిలియన్ డాలర్లకు ఈటన్ (Eaton) అనే సంస్థకు విక్రయించారు. అయితే ఈ డీల్‌లో ఒక అసాధారణమైన షరతును ఆయన ముందే పెట్టారు.
కంపెనీ విక్రయంలో భాగంగా వచ్చే మొత్తంలో 15 శాతం వాటా, అంటే దాదాపు రూ. 2,000 కోట్లను, ఎన్నో సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు కేటాయించాలన్నది ఆ షరతు. ఉద్యోగులే తన కంపెనీకి నిజమైన బలం అన్న భావనతో గ్రాహమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈటన్ సంస్థ దీనికి అంగీకరించడంతో, వచ్చే ఐదేళ్ల కాలంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 4 కోట్ల వరకు బోనస్ అందేలా ప్రణాళిక రూపొందింది. ఇప్పటికే కొంత మొత్తం ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం కూడా ప్రారంభమైందని సమాచారం. కొత్త యాజమాన్యంలో కూడా ఉద్యోగులు కొనసాగితే, భవిష్యత్తులో వారికి వచ్చే మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని మొదట విన్నప్పుడు ఉద్యోగులకే నమ్మకం కలగలేదట. ఇది నిజమేనా అనే అనుమానం మొదట వచ్చింది. మాకు ఇది లాటరీ తగిలినట్టే ఉంది అని బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ హెక్టర్ మొరెనో భావోద్వేగంగా స్పందించారు. 1995 నుంచి అదే సంస్థలో పనిచేస్తున్న లేసియా అనే ఉద్యోగి, తనకు కేటాయించిన బోనస్ గురించి తెలుసుకున్న వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారని సహోద్యోగులు చెబుతున్నారు. ఈ డబ్బుతో తన అప్పులు తీర్చుకుని కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటానని ఆమె తెలిపారు. ఇలా ఒక్కో ఉద్యోగి తన ఆనందాన్ని తనదైన రీతిలో వ్యక్తం చేస్తున్నారు.
గ్రాహమ్ వాకర్ డిసెంబర్ 31తో సీఈఓ పదవికి వీడ్కోలు చెప్పనున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఉద్యోగుల జీవితాల్లో శాశ్వత గుర్తుగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ కథ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇది నిజమైన క్రిస్మస్ కథ , ఇలాంటి యాజమాన్య భావన ప్రపంచానికి అవసరం , ఈ బాస్ తన ఉద్యోగులను కుటుంబంలా చూశారు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఉద్యోగులకు పండుగ కానుకలు ఇచ్చిన ఉదాహరణలు ఇవే మొదటివి కావు. ఇటీవల హరియాణాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ యజమాని ఎమ్‌కే భాటియా కూడా క్రిస్మస్ సందర్భంగా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సంస్థ విజయానికి కీలకంగా పనిచేసిన ఉద్యోగులకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమా తనకు ప్రేరణగా నిలిచిందని కూడా చెప్పారు.
వాస్తవానికి ఎమ్‌కే భాటియా ఇదే మొదటిసారి ఇలా చేయడం కాదు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా కూడా ‘స్టార్ పెర్‌ఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన 15 మంది ఉద్యోగులకు కార్లను కానుకగా ఇచ్చారు. టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాహనాలను కంపెనీ పేరు మీద కొనుగోలు చేసి ఉద్యోగులకు వినియోగానికి ఇచ్చారు. ఆ కార్లకు సంబంధించిన ఫైనాన్స్ బాధ్యతను కంపెనీయే భరిస్తుంది. అయితే వాహనాలు సంస్థ పేరిటే ఉంటాయి. కంపెనీ పనుల కోసం వాడితే ఇంధన ఖర్చును కూడా సంస్థే భరిస్తుంది. వ్యక్తిగత వినియోగానికి అయితే ఇంధన వ్యయం ఉద్యోగులే భరించాలి.
ఈ తరహా సంఘటనలు ఉద్యోగుల పట్ల యాజమాన్యం చూపే గౌరవం, మానవీయత ఎంత కీలకమో మరోసారి చాటిచెబుతున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో లాభాలకే పరిమితం కాకుండా, మనుషుల్ని విలువైన సంపత్తిగా చూసే ఆలోచనకు ఇవి చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.