Amul Milk: అమూల్ పాలు ఇక విదేశాల్లోనూ..స్పెయిన్ నుంచే తొలి అడుగు!
Amul Milk: భారత పాల విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ స్థాపించిన అమూల్.. ఇప్పుడు ప్రపంచానికి పాలు పంచుకోనుంది.
Amul Milk: అమూల్ పాలు ఇక విదేశాల్లోనూ..స్పెయిన్ నుంచే తొలి అడుగు!
Amul Milk: భారత పాల విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ స్థాపించిన అమూల్.. ఇప్పుడు ప్రపంచానికి పాలు పంచుకోనుంది. అమూల్ పాలు ఇక కేవలం భారతదేశంలోనే కాదు, యూరోపియన్ దేశాల్లోని ప్రజల రుచిని కూడా ఆస్వాదించనున్నాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (అమూల్) బుధవారం ఒక కీలక ప్రకటన చేసింది. స్పెయిన్, యూరోపియన్ యూనియన్‌లలో అమూల్ పాలను పరిచయం చేయడానికి స్పెయిన్ ప్రముఖ సహకార సంస్థ కోఆపరేటివ్ గనడెరా డెల్ వాలే డే లాస్ పెడ్రోచెస్ (COVAP)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం అమూల్ తన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు విస్తరించడంలో ఒక పెద్ద అడుగుగా నిలుస్తుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా అమూల్ పాలను మొదటగా మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో పరిచయం చేయనున్నట్లు అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత పోర్చుగల్‌లోని మలగా, వాలెన్సియా, అలికాంటే, సెవిల్లె, కార్డోబా, లిస్బన్ వంటి నగరాల్లో కూడా అమూల్ పాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఒప్పందంపై అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా మాట్లాడుతూ.."ఒక ప్రతిష్టాత్మక స్పానిష్ డైరీ సహకార సంస్థ అయిన COVAPతో కలిసి పనిచేయడం మాకు చాలా గౌరవంగా ఉంది" అని పేర్కొన్నారు. 2025ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి భారతీయుడికి అమూల్ బ్రాండ్‌ను దగ్గర చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో అమూల్ జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ సహా ఇతర యూరోపియన్ దేశాలలో కూడా పాలు, ఇతర ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. COVAP అధ్యక్షుడు రిగార్డో డెల్గాడో విజ్‌కైనో మాట్లాడుతూ.. "అమూల్‌తో ఈ భాగస్వామ్యం స్పెయిన్‌లో మా బ్రాండ్‌ను పెంచుకోవడానికి మరొక సహకార సంస్థతో కలిసి పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది మా డైరీ రైతు సభ్యులకు మాత్రమే కాకుండా భారతదేశంలోని డైరీ రైతు సభ్యులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది" అని తెలిపారు.
అమూల్ కథ 1946 డిసెంబర్ 14న గుజరాత్‌లో ఒక చిన్న సహకార సొసైటీగా ప్రారంభమైంది. అప్పట్లో కేవలం 250 లీటర్ల పాలు మాత్రమే సేకరించగలిగిన అమూల్, నేడు రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను సేకరించి వ్యాపారం చేస్తోంది. ఈ ప్రస్థానంలో లక్షలాది మందికి ఉపాధి కూడా కల్పించింది. భారతదేశపు మిల్క్‌మ్యాన్ అని పిలవబడే డాక్టర్ వర్గీస్ కురియన్, గుజరాత్‌లోని రెండు గ్రామాలను సభ్యులుగా చేసుకుని ఈ డైరీ సహకార సంఘాన్ని స్థాపించారు. గేదె పాల నుంచి పౌడర్ తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి కురియన్. అంతకుముందు ఆవు పాల నుంచి పౌడర్ తయారు చేసేవారు. కానీ కురియన్ ఈ మొత్తం ప్రక్రియను మార్చి, గేదె పాల నుంచి పౌడర్ ఉత్పత్తిని ప్రారంభించారు. అమూల్ ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ఎదగడంలో ఆయన కృషి అపారమైనది.