AI Storm: ఐటీ కంపెనీలకు ‘ఏఐ’ భారీ షాక్..ఇక కష్టమే..!
AI Storm: భారత స్టాక్ మార్కెట్‌లో గత వారం రోజులుగా ఒకే ఒక్క పదం ఇన్వెస్టర్ల నిద్ర పోగొడుతోంది.. అదే 'కృత్రిమ మేధ' .
AI Storm: భారత స్టాక్ మార్కెట్‌లో గత వారం రోజులుగా ఒకే ఒక్క పదం ఇన్వెస్టర్ల నిద్ర పోగొడుతోంది.. అదే 'కృత్రిమ మేధ' . అవును, సాంకేతిక విప్లవం అనుకున్న ఏఐ, ఇప్పుడు ఐటీ కంపెనీల పాలిట శాపంగా మారుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే మన దేశంలోని టాప్-6 కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.
అమెరికాకు చెందిన 'ఆంత్రోపిక్' అనే ఏఐ స్టార్టప్ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్ ఈ విధ్వంసానికి ప్రధాన కారణం. ఈ సరికొత్త ఏఐ ఏజెంట్లు.. గతంలో వేల మంది ఉద్యోగులు చేసే డేటా ఎంట్రీ, కాంట్రాక్ట్ అనాలిసిస్, అవుట్‌సోర్సింగ్ పనులను క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల లక్షల మంది ఉద్యోగులపై ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది.
కుప్పకూలిన ఐటీ షేర్లు
ఈ ఏఐ తుఫాను ధాటికి ఐటీ దిగ్గజాలు విలవిలలాడాయి.TCS అత్యధికంగా రూ. 70,481 కోట్లు నష్టపోయింది.Infosys దాదాపు రూ. 54,000 కోట్ల సంపదను కోల్పోయింది. HCL Tech & Wipro ఇవి కూడా వేల కోట్ల నష్టాలను చవిచూశాయి. దీని ప్రభావంతో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 8.3 శాతం పడిపోగా, అంతర్జాతీయ దిగ్గజాలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ షేర్లు కూడా 10 శాతం మేర పతనమయ్యాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి భారీ సంస్థల విలువ కూడా క్షీణించింది.
మార్కెట్ మొత్తం ఎర్ర సముద్రాన్ని తలపిస్తున్నా.. ఎస్‌బీఐ (SBI), ఐటీసీ (ITC) వంటి సంస్థలు మాత్రం లాభాల్లో నిలవడం విశేషం. ఇది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఐటీ నుండి ఇతర రంగాలకు మళ్ళిస్తున్నారనే సంకేతాన్ని ఇస్తోంది. సాంకేతికత మారినప్పుడల్లా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వడం సహజమే. అయితే, భారతీయ ఐటీ సంస్థలు ఈ 'ఏఐ' సవాలును ఎలా స్వీకరిస్తాయి? తమ వ్యాపార శైలిని ఎలా మార్చుకుంటాయి? అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.