Liquor Policy: ఇక టెట్రా ప్యాక్ లలో మందు.. జ్యూస్ ప్యాకెట్లలాగే అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
Liquor Policy: ఒడిశా ప్రభుత్వం కొత్త అబ్కారీ విధానం 2026-29లో టెట్రా ప్యాక్ మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. కఠిన నిబంధనలు, భద్రతా ప్రమాణాలతో ఈ ప్యాకెట్లు అందుబాటులోకి రానున్నాయి.
Liquor Policy
Liquor Policy: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రాష్ట్రంలో మద్యం బాటిళ్లలోనే కాకుండా, మనం ఫ్రూట్ జ్యూస్ తాగే టెట్రా ప్యాక్‌లలో కూడా లభించనుంది. 2026-29 కొత్త అబ్కారీ విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. దీనిపై ఒడిశా ఎక్సైజ్ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం కీలక వివరణ ఇచ్చారు. మద్యాన్ని టెట్రా ప్యాక్‌లలో విక్రయించాలనే నిబంధన ఒడిశా ఎక్సైజ్ పాలసీలో 2014 నుంచి ఉందని మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పష్టం చేశారు. అయితే, ఇప్పటివరకు ఇది మార్కెట్లో అందుబాటులోకి రాలేదని ఆయన తెలిపారు. ఎవరైనా లైసెన్స్ పొందిన తయారీదారులు లేదా విక్రేతలు ఈ విధానంలో మద్యం అమ్మాలనుకుంటే ప్రభుత్వం అడ్డు చెప్పదని, దానికి కావాల్సిన అనుమతులు ఇస్తామని ఆయన వెల్లడించారు. దీనివల్ల నకిలీ మద్యం బెడద తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
టెట్రా ప్యాక్‌లలో మద్యం విక్రయించడానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలను విధించింది. దీని ప్రకారం, ప్యాకెట్‌లో కేవలం 180 మిల్లీలీటర్ల మద్యం మాత్రమే ఉండాలి. అలాగే, ఆ ప్యాకెట్ ఆరు రకాల లేయర్లతో కూడి ఉండాలి. మద్యం క్వాలిటీ చెడిపోకుండా ఉండేందుకు గడువు తేదీని ప్యాకెట్ పై స్పష్టంగా ముద్రించాలి. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ వంటి సంస్థల నుండి నాణ్యత ధృవీకరణ పత్రం పొందిన తర్వాతే వీటిని మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. సాధారణంగా గాజు బాటిళ్లను రీఫిల్ చేసి నకిలీ మద్యాన్ని అమ్మే అవకాశం ఉంటుంది, కానీ టెట్రా ప్యాక్‌లను ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడటం కుదరదు కాబట్టి కల్తీకి తావుండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా విదేశీ మద్యం తయారీదారులు తమ ఉత్పత్తులను టెట్రా ప్యాకింగ్‌లో సరఫరా చేయవచ్చు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మడం అనేది అనైతికమని, ఇది యువతను తప్పుదోవ పట్టిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. జ్యూస్ ప్యాకెట్లు అనుకుని చిన్న పిల్లలు కూడా పొరబడే అవకాశం ఉందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఆదాయం కోసమే ఇలాంటి యువత వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తోందని వారు విమర్శిస్తున్నారు.