Salary Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంత పెరుగుతాయంటే..?
Salary Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంత పెరుగుతాయంటే..?
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు..అంతా కూడా 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కమిషన్ సిఫార్సులతో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పెరుగుతాయి. కనీసం 2.15 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ గా అంచనా వేస్తుండగా.. బేసిక్ పే రెట్టింపు కానుంది. ఏ స్థాయి ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకుందాం.
7వ వేతన సంఘం పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. సాధారణంగా ప్రతి 10ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం.. 2026లో 8వ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే.. ఈ ప్రక్రియ అనుకున్నదానికంటే ఎక్కువగా ఆలస్యం అవుతోంది. ఇప్పటికే జనవరి నెలలోనే 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. అయినప్పటికీ దానికి సంబంధించిన విధివిధానాలు ఖరారవ్వడానికి దాదాపు 10 నెలల సమయం పట్టింది. చివరికి నవంబర్‌లో కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ కమిషన్‌కు సిఫార్సులు తయారు చేయడానికి సుమారు 18 నెలల సమయం ఇచ్చారు. అంటే.. కమిషన్ తన నివేదికను సమర్పించిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. 8వ వేతన సంఘం అమలుకు ఇంకా దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చినా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్లు పెరగడం మాత్రం ఖాయమనే చెప్పాలి. ఆలస్యం అవుతున్నందుకు ఉద్యోగులు, పెన్షనర్లు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, మరోవైపు భారీగా జీతాలు పెరిగే అవకాశముందని ఆశతో ఎదురుచూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే జీతభత్యాలు, అలవెన్సులు, డీఏ, పెన్షన్ వంటి అంశాలు ఖరారవుతాయి.
ఈ మొత్తం ప్రక్రియలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకమైంది. ప్రస్తుత బేసిక్ జీతాన్ని ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణిస్తారన్నదానిపైనే కొత్త జీతం ఆధారపడి ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే జీతం గణనీయంగా పెరుగుతుంది. తక్కువగా ఉంటే పెరుగుదల పరిమితంగా ఉంటుంది. సాధారణంగా ఇది 2 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15గా నిర్ణయిస్తే, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే రూ.18,000 అయితే, 2.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేస్తే కొత్త బేసిక్ పే రూ.38,700కు చేరుతుంది. అంటే, జీతం రెట్టింపుకి మించిన స్థాయిలో పెరుగుతుందన్న మాట. అలాగే ప్రస్తుత బేసిక్ పే రూ.50,000 ఉన్న ఉద్యోగికి కొత్త బేసిక్ జీతం సుమారు రూ.1,07,500 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
లెవెల్ వారీగా చూస్తే.. లెవెల్-1 ఉద్యోగికి ప్రస్తుతం ఉన్న రూ.18,000 బేసిక్ జీతం రూ.38,700కు పెరుగుతుంది. లెవెల్-2లో ప్రస్తుతం రూ.19,900గా ఉన్న బేసిక్ పే రూ.42,785కు చేరుతుంది. లెవెల్-3లో రూ.21,700 నుంచి రూ.46,655కు పెరుగుతుంది. లెవెల్-4 ఉద్యోగికి ప్రస్తుతం రూ.25,500గా ఉన్న కనీస వేతనం రూ.54,825కు చేరుతుంది. లెవెల్-5లో రూ.29,200 బేసిక్ పే రూ.62,780కు పెరుగుతుంది. ఇదే విధంగా అన్ని స్థాయిల ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతాలు పెరుగుతాయి.
వేతన సంఘం అమలు ఆలస్యమైనప్పటికీ, అమలైన తేదీ నుంచి వర్తించేలా ఎరియర్స్ కూడా చెల్లించే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం ఉన్నా, 8వ వేతన సంఘం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ లాభాలను తీసుకొస్తుందని చెప్పొచ్చు.