Budget 2026 : రూ.13 లక్షల ఆదాయం వరకు నో టాక్స్? సామాన్యులకు నిర్మలమ్మ 5 వరాలు
రూ.13 లక్షల ఆదాయం వరకు నో టాక్స్? సామాన్యులకు నిర్మలమ్మ 5 వరాలు
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజలు, రైతులు, వృద్ధులే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈసారి వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంతో పాటు, సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఐదు కీలక రంగాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆదాయపు పన్ను నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు ఈ బడ్జెట్‌లో ఉండబోయే ఆ ఐదు కీలక అంశాలు ఇవే!
బడ్జెట్ 2026లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆదాయపు పన్ను. కొత్త టాక్స్ రిజీమ్‌ను మరింత పాపులర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ.12.75 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.13 లక్షలకు పెంచే అవకాశం ఉంది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల చేతిలో అదనపు నగదు మిగులుతుంది, తద్వారా మార్కెట్‌లో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
దేశానికి వెన్నెముక అయిన రైతన్నల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న రూ.6,000 మొత్తాన్ని రూ.9,000కు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 11 కోట్ల రైతు కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేయకుండా ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా రూ. 35 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
రైల్వే రంగంలో ప్రయాణికులకు ఎదురవుతున్న వెయిటింగ్ లిస్ట్ సమస్యను 2030 నాటికి పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ బడ్జెట్‌లో 300కు పైగా కొత్త వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు 15 శాతం పెరిగే అవకాశం ఉండటంతో, కొత్త ట్రాక్‌ల నిర్మాణం మరియు కోచ్‌ల ఆధునీకరణ పనులు వేగవంతం కానున్నాయి. ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను రైళ్లలో అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం.
పర్యావరణ హితమైన విద్యుత్ కోసం పీఎం సూర్య ఘర్ పథకానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేయబోతున్నారు. 2 కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ఇచ్చే సబ్సిడీని కిలోవాట్‌కు రూ.40 వేలకు పెంచే అవకాశం ఉంది. అంటే 2 కిలోవాట్ల ప్యానెల్స్ పెట్టుకుంటే ప్రభుత్వమే రూ. 80 వేల వరకు సాయం చేస్తుంది. 2027 నాటికి కోటి ఇళ్లకు సోలార్ గ్రిడ్ అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోంది. దీనివల్ల సామాన్యులకు కరెంటు బిల్లుల బాధ తప్పుతుంది.
వైద్య రంగంలో ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిని ప్రస్తుతం ఉన్న 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల కోట్లాది మంది వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అలాగే క్యాన్సర్, గుండె శస్త్రచికిత్సల వంటి ఖరీదైన వైద్యం కోసం ఈ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ మార్పులు జరిగితే సామాన్య కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం భారీగా తగ్గుతుంది.