Gold Price Crash: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..బంగారం రూ.25వేలు, వెండి రూ.85వేలు తగ్గింది..మిస్సవద్దు
బంగారం రూ.25వేలు, వెండి రూ.85వేలు తగ్గింది..మిస్సవద్దు
Gold Price Crash: బంగారం, వెండి మార్కెట్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. గురువారం వరకు ఆకాశమే హద్దుగా పరుగులు తీసిన ధరలు, శుక్రవారం నాడు అనూహ్యంగా కుప్పకూలాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే వెండి ధర ఏకంగా రూ.85,000 పడిపోగా, బంగారం ధర తులంపై రూ.25,000 పైగా తగ్గింది. ఈ భారీ పతనం ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేయగా, సామాన్య కొనుగోలుదారులకు మాత్రం పెద్ద ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. అయితే, శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి పరిస్థితి తలకిందులైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గురువారం నాడు కేజీ వెండి ధర రూ.4.20 లక్షల రికార్డు స్థాయికి చేరగా, శుక్రవారం నాటికి అది ఏకంగా రూ.3.35 లక్షలకు పడిపోయింది. అంటే కేవలం ఒకే రోజులో కేజీపై రూ.85,000 తగ్గడం అనేది మార్కెట్ చరిత్రలో అరుదైన పరిణామం. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ.1,93,096 గరిష్ట స్థాయి నుంచి రూ.25,500 తగ్గి రూ.1,67,406 వద్దకు చేరింది.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం లాభాల స్వీకరణ. ధరలు గరిష్ట స్థాయిలో ఉండటంతో పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలను వెనకేసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు వేగంగా పడిపోయాయి. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ పెరగడం కూడా పసిడిపై ఒత్తిడి తెచ్చింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి, ఇప్పుడు అదే జరుగుతోంది. సాంకేతికంగా చూస్తే, గత కొద్ది కాలంగా బంగారం, వెండి ఓవర్ బాట్ (అతిగా కొనడం) జోన్‌లో ఉండటంతో ఈ సరిదిద్దుబాటు తప్పదని విశ్లేషకులు ముందే ఊహించారు.
అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ పతనానికి ఆజ్యం పోశాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఫెడరల్ రిజర్వ్ తదుపరి అధిపతిగా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడం మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించింది. కొత్త నాయకత్వం వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. దీనివల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుని రిస్క్ తక్కువగా ఉండే ఇతర మార్గాల వైపు మళ్లుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర కూడా 5 శాతానికి పైగా పడిపోయి 5,087 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్థానిక మార్కెట్‌లో పన్నులతో కలిపి చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 7.65 శాతం తగ్గి రూ.1,69,000 వద్దకు చేరింది. వెండి కూడా 5 శాతం తగ్గి రూ.3,84,500 వద్ద నిలిచింది. ధరలు భారీగా తగ్గడంతో సాధారణ జనం, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు చేయించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. డాలర్ ఇండెక్స్ మరియు అమెరికా ఫెడ్ నిర్ణయాలపైనే రాబోయే రోజుల్లో బంగారం దిశానిర్దేశం ఆధారపడి ఉంటుంది.