Vinfast: భారత్ ఈవీ మార్కెట్‌పై కన్నేసిన వియత్నాం కంపెనీ.. జులైలో రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు లాంచ్
Vinfast: వియత్నాంకు చెందిన కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Vinfast: వియత్నాంకు చెందిన కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం VF 7, VF 6 మోడళ్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ రెండు కార్లు ఈవీ సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్లుగా మారుతాయని విన్‌ఫాస్ట్ ఇండియా సిఇఒ అశ్విన్ అశోక్ పాటిల్ అన్నారు. అలానే సేఫెస్ట్ కార్లని వెల్లడించారు. విన్‌ఫాస్ట్ తమిళనాడు సమీపంలోని తూత్తుకుడిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేసింది. రండి.. ఈ రెండు కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విన్‌ఫాస్ట్ భారతీయ మార్కెట్ కోసం మొదటి రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. రెండు ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్‌యూవీలు- VF 7 , VF 6లను ఆవిష్కరించడం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో విన్‌ఫాస్ట్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ పేర్కొంది. కంపెనీ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో డీలర్‌లను నియమిస్తోంది. ఈ వివరాలను కంపెనీల త్వరలోనే వెల్లడించనుంది. ఇండియా-సెంట్రిక్ ప్రీమియం VF 7, VF 6 ఎస్‌యూవీలు విక్రయాలు జులై మొదటి వారంలో ప్రారంభమవుతాయని తెలిపింది.
ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో 5 సీట్లు ఉంటాయి. వాటి బ్యాటరీ 75.3 కిలోవాట్, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. VF7 మోడల్ సింగిల్ లేదా డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో డిఫరెంట్ వేరియంట్‌లలో వస్తుంది. సింగిల్ మోటార్ వేరియంట్ 201 బిహెచ్‌పి పవర్, 310 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఫ్రంట్-వీల్ డ్రైవ్‌గా ఉంటుంది.
VF6, VF7 ఎస్‌యూవీల డ్యూయల్ మోటార్ సెటప్ 348 బిహెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్ ఒకే విధంగా ఉంటుంది. డ్యూయల్ మోటార్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 431 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. రెండిటిలో 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెవల్-2 అడాస్ ఫీచర్‌లు ఉన్నాయి. DC ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు వేరియంట్‌లను కేవలం 35 నిమిషాల్లో 10శాతం నుండి 70శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.