Mahindra Vision S : థార్ లుక్.. స్కార్పియో పవర్..పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో దూసుకొస్తున్న మరో పవర్ఫుల్ వెపన్

థార్ లుక్.. స్కార్పియో పవర్..పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో దూసుకొస్తున్న మరో పవర్ఫుల్ వెపన్

Update: 2026-02-02 03:30 GMT

Mahindra Vision S : మహీంద్రా అంటేనే గంభీరమైన ఎస్‌యూవీలకు మారుపేరు. ఇప్పుడు ఆ సంస్థ నుంచి మరో పవర్‌ఫుల్ బాహుబలి రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు విజన్ ఎస్ అనే పేరుతో కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే ఉన్న ఈ కారు, తాజాగా రోడ్లపై టెస్టింగ్ చేస్తూ దొరికిపోయింది. దీని డిజైన్ లీక్ అవ్వడంతో ఆటోమొబైల్ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ముఖ్యంగా సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ కారు, థార్, స్కార్పియోల కలయికలా కనిపిస్తోంది.

భారతీయ రోడ్లపై మహీంద్రా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా విజన్ ఎస్ అనే కొత్త ఎస్‌యూవీని డెవలప్ చేస్తోంది. తాజాగా ఈ కారు టెస్టింగ్ చేస్తున్న సమయంలో కెమెరా కంటికి చిక్కింది. దీని బాక్సీ డిజైన్, రౌండ్ హెడ్‌లైట్స్ చూస్తుంటే పాతకాలపు క్లాసిక్ లుక్‌ను, ఆధునిక ఫీచర్లను మిక్స్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇందులో వెర్టికల్ గ్రిల్, హ్యాలోజన్ టర్న్ ఇండికేటర్లు ఉండటంతో ఇది ఒక రఫ్ అండ్ టఫ్ ఆఫ్-రోడర్ అని అర్థమవుతోంది. డీజిల్ ఇంజన్ కోసం ప్రత్యేకమైన అడ్-బ్లూ రిఫిల్ క్యాప్ ఉండటం వల్ల ఇది బీఎస్6 ఫేజ్-2 నిబంధనలకు అనుగుణంగా వస్తోందని స్పష్టమైంది.

ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ కూడా చాలా రిచ్‌గా ఉండబోతోంది. లీకైన సమాచారం ప్రకారం ఇందులో పెద్ద పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ ఉంటుంది. అలాగే 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫ్యాబ్రిక్ సీట్లు, కవర్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లలో 60:40 స్ప్లిట్ రేషియో ఉండటం వల్ల స్టోరేజ్ స్పేస్ పెంచుకోవడానికి వీలుంటుంది. స్టీరింగ్ వీల్‌పై కూడా ఆడియో కంట్రోల్స్ అమర్చారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు సిటీలోనూ, ఆఫ్-రోడ్ లోనూ సాఫీగా ప్రయాణించేలా రూపొందించారు.

మహీంద్రా తన సరికొత్త NU IQ ప్లాట్‌ఫామ్ మీద ఈ కారును నిర్మిస్తోంది. ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, స్కార్పియో కుటుంబంలో భాగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంజన్ విషయానికి వస్తే.. ఎక్స్‌యూవీ 3XO లోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేదా థార్ లోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఇది లభించవచ్చు. 2027 నాటికి భారత రోడ్లపైకి రానున్న ఈ విజన్ ఎస్ తో పాటు విజన్ ఎక్స్, విజన్ టి వంటి మరికొన్ని మోడళ్లను కూడా మహీంద్రా లైన్లో పెట్టింది.

Tags:    

Similar News