Tata Punch : ట్రక్కు వచ్చి గుద్దినా చెక్కుచెదరదు..టాటా పంచ్ సేఫ్టీ చూస్తే దిమ్మతిరగాల్సిందే
ట్రక్కు వచ్చి గుద్దినా చెక్కుచెదరదు..టాటా పంచ్ సేఫ్టీ చూస్తే దిమ్మతిరగాల్సిందే
Tata Punch : టాటా మోటార్స్ తన సంచలన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్‌తో మార్కెట్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో మైలేజీకి పెట్టింది పేరుగా మారిన ఈ కారు, ముఖ్యంగా సీఎన్‌జీ వేరియంట్‌లో తిరుగులేని రికార్డులను సృష్టిస్తోంది. నెమ్మదిగా తన సొంత అన్న టాటా నెక్సాన్‌ను కూడా వెనక్కి నెట్టి మరీ అమ్మకాల్లో దూసుకుపోతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ చిచ్చరపిడుగు విశేషాలు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ చరిత్రలో పంచ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2024 క్యాలెండర్ ఇయర్ లో దేశంలోనే నెంబర్ 1 కారుగా నిలిచిన పంచ్, 2025లో నెక్సాన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, సీఎన్‌జీ విభాగంలో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం పంచ్ సీఎన్‌జీ మోడల్లే 71,113 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో నెక్సాన్ సీఎన్‌జీ కేవలం 34,712 యూనిట్లకే పరిమితమైంది. అంటే నెక్సాన్ కంటే రెట్టింపు స్థాయిలో పంచ్ సీఎన్‌జీని జనం ఇష్టపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరలో మంచి మైలేజీ, ఎస్‌యూవీ ఫీచర్లు ఉండటమే.
మైలేజీ, ఇంజిన్ పవర్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఇంజిన్ పరంగా కంపెనీ చాలా మార్పులు చేసింది. ఇందులో కొత్తగా 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ను ప్రవేశపెట్టారు. ఇది 120 PS పవర్, 170 Nm టార్క్‌ను అందిస్తుంది. సామాన్యుల కోసం 1.2 లీటర్ రెవోట్రాన్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.97 కిలోమీటర్లు ఇస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్ ఏకంగా 26.99 కిలోమీటర్ల (Km/Kg) మైలేజీని ఇస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది వరం లాంటిది.
స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్లు
కొత్త టాటా పంచ్ తన పాత బాక్సీ లుక్‌ను కొనసాగిస్తూనే మరింత షార్ప్‌గా తయారైంది. స్లిమ్ LED DRLs, బ్లాక్ అవుట్ గ్రిల్, కొత్త LED హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. కారు లోపల 10.24 అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సీఎన్‌జీ కారు అయినప్పటికీ, టాటా తన ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ద్వారా 210 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తోంది, ఇది ఈ సెగ్మెంట్ లోనే అత్యధికం.
ట్రక్కు వచ్చి గుద్దినా చెక్కుచెదరని సేఫ్టీ
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ రాజీ పడదు. పంచ్ ఫేస్‌లిఫ్ట్ లో ఇప్పుడు స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సేఫ్టీ టెస్ట్ సిమ్యులేషన్ లో, 50 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ట్రక్కు ఎదురుగా వచ్చి గుద్దినా పంచ్ బాడీ స్ట్రక్చర్ చెక్కుచెదరలేదు. ప్రమాదం తర్వాత కూడా నాలుగు డోర్లు సులభంగా తెరుచుకోవడం విశేషం. ESC, ABS, TPMS వంటి ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి భద్రతను కల్పిస్తాయి. హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తూ టాటా పంచ్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ ఫేవరెట్ ఎస్‌యూవీగా నిలిచింది.