Tata Motors: నెక్సాన్.ev, కర్వ్.ev యజమానులకు శుభవార్త..!
వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు టాటా మోటార్స్ కీలక ప్రకటన చేసింది. తన ఈవీ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, Tata Nexon.ev మరియు Tata Curvv.ev యజమానులకు లైఫ్‌టైమ్ హై-వోల్టేజ్ (HV) బ్యాటరీ వారంటీని ప్రకటించింది. ఇందులో 45kWh బ్యాటరీ ప్యాక్ మోడళ్లను కలుపుతుంది. ఈ వారంటీ కొత్తగా కొనుగోలు చేసే వారితో పాటు, ఇప్పటికే ఈ మోడళ్లను తీసుకున్న కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.
హారియర్ ev లాంచ్‌తో లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని తొలిసారి ప్రవేశపెట్టిన టాటా, ఇప్పుడు దానిని నెక్సాన్ ev, కర్వ్ evలకు విస్తరించింది. ఈ వారంటీ వాహన రిజిస్ట్రేషన్ తేది నుంచి 15 సంవత్సరాల పాటు, అపరిమిత కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది.
టాటా మోటార్స్ ప్రకారం, ఈ వారంటీ ఈవీ కొనుగోలు దిశగా ఆలోచిస్తున్న వారికి భద్రతను కలిగించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చులు తగ్గడం వల్ల, వినియోగదారులకు దశాబ్ధ కాలంలో రూ.8–9 లక్షల వరకు ఆదా అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కేవలం నిర్వహణ ఖర్చులే కాదు, వాహన రీసేల్ విలువ కూడా పెరుగుతుందని చెబుతోంది.
అంతేకాక, ఇప్పటికే Curvv.ev మరియు Nexon.ev (45kWh) వేరియంట్ తీసుకున్న ప్రస్తుత కస్టమర్లకు రూ.50,000 విలువైన లాయల్టీ ప్రయోజనాలు కూడా అందించనున్నట్లు ప్రకటించింది. టాటా తీసుకొచ్చిన ఈ సరికొత్త ఆఫర్‌లు మార్కెట్లో తన ఈవీ వాహనాల ఆదరణను మరింతగా పెంచనున్నాయి.