Royal Enfield Hunter 350: బాబోయ్.. ఇంత డిమాండా? ఈ డుగ్గు డుగ్గు బండిని 5 లక్షల మంది కొనేశారు
Royal Enfield Hunter 350: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350ని భారత్‌లో ఆగస్టు 2022లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ బైక్ సేల్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రతి నెలా కూడా ఈ బైక్ అమ్మకాలు భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఈ బైక్ దేశంలో 5 లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఇది కంపెనీకి పెద్ద విజయం. హంటర్ 350 రూ.1.49 లక్షల ధరతో విడుదలైంది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. మొదటి సంవత్సరంలో 1 లక్ష యూనిట్లకు పైగా హంటర్ 350 బైక్స్ అమ్ముడయ్యాయి. కేవలం 5 నెలల్లోనే మరో లక్ష బైక్స్ అమ్ముడయ్యాయి. అయితే 5 లక్షల సేల్స్ మార్కెట్‌ను దాటడానికి 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ధర
ప్రస్తుతం హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఉంది. ఇది రెట్రో, మెట్రో రెబెల్, మెట్రో వేరియంట్లలో అందుబాటులో ఉంది. దాని క్లాసిక్ కాంపాక్ట్ డిజైన్, ఫీచర్లు, మైలేజీతో ఈ బైక్ యువత హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బ్లాక్ కలర్, బ్లూ, గ్రీన్, రెడ్, వైట్, గ్రేస్ రెబెల్ బ్లాక్, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇంజిన్
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో పవర్‌ఫుల్ 349CC సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, ఎస్ఓహెచ్‌సి ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2hp పవర్, 27Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు. ARAI ప్రకారం.. ఈ బైక్ 36.22 KMPL మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఎంట్రీ-లెవల్ మిడిల్ వెయిట్ బైక్‌ను జె-సిరీస్ ఆర్కిటెక్చర్‌పై తయారు చేశారు.
హంటర్ 350 అన్ని వేరియంట్లలో ట్యూబ్‌లెస్ టైర్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ పొడవు 2,055mm, వెడల్పు 800mm, ఎత్తు 1,055mm, వీల్‌బేస్ 1,320mm గా ఉంది. స్ట్రాంగ్ బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో డిస్క్ బ్రేక్‌లు కూడా ఇచ్చారు.