Kia Seltos : ఆరేళ్లలో 6 లక్షల కార్లు సేల్.. భారత రోడ్లపై కియా సెల్టోస్ ప్రభంజనం
ఆరేళ్లలో 6 లక్షల కార్లు సేల్.. భారత రోడ్లపై కియా సెల్టోస్ ప్రభంజనం
Kia Seltos : కియా ఇండియా చరిత్రలో అరుదైన మైలురాయి నమోదైంది. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి మేడ్-ఇన్-ఇండియా కారు కియా సెల్టోస్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. 2019లో అట్టహాసంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్, కేవలం ఆరేళ్లలోనే 6 లక్షల యూనిట్ల మార్కును దాటి, దేశంలో అత్యంత ఇష్టపడే మిడ్-సైజ్ ఎస్‌యూవీగా నిలిచింది. దేశీయ అమ్మకాలే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ ఒక బ్రాండ్‌గా స్థిరపడటానికి ప్రధాన కారణం సెల్టోస్. ఆగస్టు 2019లో లాంచ్ అయినప్పటి నుండి జనవరి 2026 చివరి నాటికి, ఈ కారు దేశీయంగా 6,02,390 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి తోడు సుమారు 1.6 లక్షల యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. కేవలం ఒకే ఒక్క మోడల్‌తో ఒక కొత్త కంపెనీ ఇంతటి ఘనత సాధించడం విశేషం.
విజయవంతమైన మొదటి తరం తర్వాత, కియా ఇండియా జనవరి 2, 2026న సెకండ్ జనరేషన్ సెల్టోస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త గ్లోబల్ K3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పాత మోడల్ కంటే ఇది మరింత పొడవుగా, వెడల్పుగా ఉండి, క్యాబిన్ లోపల అద్భుతమైన స్థలాన్ని కలిగి ఉంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లతో ఈ కారు వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
కొత్త సెల్టోస్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-డీజిల్, పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు ఇందులో ఉన్నాయి. మైలేజ్ విషయానికొస్తే, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.1 కి.మీ, పెట్రోల్ వేరియంట్ 17.9 కి.మీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టాటా కర్వ్ వంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికీ, సెల్టోస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది. 25 నెలల తర్వాత మళ్ళీ నెలవారీ అమ్మకాల్లో 10 వేల యూనిట్ల మార్కును దాటి కియాకు కొత్త ఊపునిచ్చింది.