Ather: క్రూజ్ కంట్రోల్‌తో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కంపెనీ భారీ ప్రకటన చేయనుందా?
Ather: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్లలో ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Ather: క్రూజ్ కంట్రోల్‌తో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కంపెనీ భారీ ప్రకటన చేయనుందా?
Ather: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్లలో ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏథర్ త్వరలో తమ 450 సిరీస్ స్కూటర్లలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఆగస్టు 30న జరగబోయే కమ్యూనిటీ డే ఈవెంట్‌లో కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ గురించి, ఏథర్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఏథర్ ఎనర్జీ ప్రతి సంవత్సరం నిర్వహించే కమ్యూనిటీ డే ఈసారి ఆగస్టు 30న జరగనుంది. ఈ సందర్భంగా ఏథర్ తమ స్కూటర్లలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ వంటి కొన్ని ఇతర కంపెనీల స్కూటర్లలో ఉంది. అయితే, ఏథర్ దీనిని తమ స్కూటర్లకు జోడించడం వల్ల వినియోగదారులకు డ్రైవింగ్ అనుభవం మరింత సులభతరం అవుతుంది.
ఈ కొత్త ఫీచర్ ఏథర్ 450ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇప్పటికే ఈ మోడల్స్ కలిగి ఉన్న కస్టమర్లకు కూడా అథెర్‌స్టాక్ ప్రో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ లభించవచ్చని సమాచారం.
ఏథర్ 450 సిరీస్‌లో ప్రస్తుతం మూడు ప్రధాన మోడల్స్ ఉన్నాయి. ఏథర్ 450ఎస్ ఇది బేస్ మోడల్. ఇది 2.9 kWh బ్యాటరీతో రూ.1.23 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. కొత్తగా వచ్చిన 3.7 kWh బ్యాటరీ మోడల్ ధర రూ.1.43 లక్షలు. 2.9 kWh మోడల్ 122 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, 3.7 kWh మోడల్ 161 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 kmph. 0 నుంచి 40 kmph వేగాన్ని కేవలం 3.9 సెకన్లలో అందుకుంటుంది.
ఏథర్ 450ఎక్స్ ఇది మిడిల్-రేంజ్ మోడల్. 2.9 kWh బ్యాటరీకి రూ.1.50 లక్షల ఎక్స్-షోరూమ్, 3.7 kWh బ్యాటరీకి రూ.1.60 లక్షలు ధర ఉంది. 2.9 kWh మోడల్ 126 కిలోమీటర్ల రేంజ్, 3.7 kWh మోడల్ 161 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 kmph, కానీ 0 నుంచి 40 kmph వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది.
ఏథర్ 450 అపెక్స్ ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్. ఇది కేవలం 3.7 kWh బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.1.84 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది 157 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 100 kmph. 0 నుంచి 40 kmph వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుంది. ఇందులో అథెర్‌స్టాక్ ప్రో ఫీచర్లు ముందుగానే ఉంటాయి.
ఏథర్ ఎనర్జీ కమ్యూనిటీ డేలో కేవలం క్రూజ్ కంట్రోల్‌ను ప్రకటించడమే కాకుండా, ఒక కొత్త ఎంట్రీ-లెవల్ మోడల్‌ను కూడా విడుదల చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ మోడల్స్ కంటే తక్కువ ధరలో ఉండవచ్చని అంచనా. ఈ ఈవెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఏథర్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు.