వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హై కోర్టు మెట్లెక్కిన సునీత... అసలేం జరిగింది?
YS Vivekananda Reddy murder case latest news updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు
YS Vivekananda Reddy murder case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హై కోర్టు సునీత పిటిషన్
Serial deaths of YS Vivekananda Reddy murder case witnesses: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రతీ రోజు విచారణ చేపట్టేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన కూతురు సునీత తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐతో పాటు తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అందరి పేర్లను ప్రతివాదులుగా చేర్చారు.
2019 మార్చి 15 అర్ధరాత్రి వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఇప్పటికి ఈ ఘటన జరిగి ఆరేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ వద్ద ఉన్న హార్డ్ డిస్కులు ఓపెన్ కాని కారణంగా గత 15 నెలలుగా విచారణకు బ్రేకులు పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి, సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత కోర్టును కోరారు.
2019 లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. ఏపీలో ఆ ఏడాది జరిగిన ఎన్నికలపై ఆ మర్డర్ ప్రభావం కనిపించిందనే అభిప్రాయం ఉంది. అలాగే కేసు విచారణ ముందుకు వెళ్లకపోవడం కూడా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించింది అనే టాక్ కూడా ఉంది.
ఇప్పటివరకు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు వేర్వేరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు చేశాయి. వారే కాకుండా హై కోర్టు ఆదేశాలతో సీబీఐ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఇన్ని బృందాలు ఈ కేసును తవ్వే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లోపలం ఏం జరిగిందనేది మాత్రం చూడలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది కావాలనే ఈ కేసును తాత్సారం చేస్తున్నారని, కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని ఆయన కూతురు సునీత పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే.
చార్జీషీట్‌లో సీబీఐ ప్రస్తావించిన పేర్లు
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పటివరకు సుమారు 250 మందిని ప్రశ్నించింది. సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో అనుమానితులు, సాక్షులు ఉన్నారు. 8 మంది పేర్లను చార్జీషీట్ లో ప్రస్తావించింది. ఎర్ర గంగిరెడ్డి (వైఎస్ వివేకానంద రెడ్డి సమీప అనుచరుడు), గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునిల్ యాదవ్, షేక్ దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి (అవినాష్ రెడ్డి తండ్రి) ఆ జాబితాలో ఉన్నారు.
ఆరేళ్లలో ఆరుగురు మృతి
ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆరేళ్లలో ఆరుగురు సాక్షులు చనిపోయారు. కే శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, నారాయణ యాదవ్, ఈ.సి. గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, రంగన్న (వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మన్) ఆ జాబితాలో ఉన్నారు.
రంగన్న మృతితో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
చివరిగా రంగన్న మృతి అనేక అనుమానాలకు తావిచ్చింది. అంతకంటే ముందు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిలో ఐదుగురు చనిపోయారు. మార్చి 5న మధ్యాహ్నం 1 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తంతో ఆయన్ను కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం 6:45 గంటలకు రంగన్న మృతి చెందారు.
వైఎస్ వివేకా ఇంటికి రంగన్న అప్పట్లో వాచ్‌మన్. ఈ కేసులో కీలకమైన సాక్షి. దీంతో రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తంచేస్తూ పులివెందుల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ కేసులో సాక్షులు ఆరుగురు చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు... కడప ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. రంగన్న మృతి కేసుతో పాటు అంతకంటే ముందుగా చనిపోయిన ఐదుగురు మృతికి కారణాలు వెలికి తీయాల్సిందిగా సర్కారు స్పష్టంచేసింది.
తాజాగా సునీత తెలంగాణ హై కోర్టును ఆశ్రయించడంతో వైఎస్ వివేకా మర్డర్ కేసు మరోసారి వార్తల్లోకెక్కింది. అనేక అనుమానాలకు తావిచ్చిన ఈ వరుస మరణాలను సునీత తన పిటిషన్‌లోనూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సునీత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నాలుగు వారాల్లోగా ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు అందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాల్సిందిగా సునీత తరపు న్యాయవాదికి సూచించింది.
More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు
- ఆ ఇంటి తాళం పగలగొట్టి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది
- ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని కొన్ని హిందూ సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? 300 ఏళ్ల క్రితం చనిపోయిన మొఘల్ సామ్రాట్పై ఇప్పటికీ ఎందుకంత కోపం?
- ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు... రంగంలోకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్
- సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు