ఫ్యాన్‌ పార్టీలో ధర్మాన దడదడ.. ప్రసాదరావుకు ఎందుకంత అసంతృప్తి?

Dharmana Prasada Rao: రాజకీయాల్లో సీనియర్‌‌గా పేరున్న ఆ నాయకుడు ఇప్పుడు సొంత పార్టీలోనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారా?

Update: 2021-11-26 08:30 GMT

ఫ్యాన్‌ పార్టీలో ధర్మాన దడదడ.. ప్రసాదరావుకు ఎందుకంత అసంతృప్తి?

Dharmana Prasada Rao: రాజకీయాల్లో సీనియర్‌‌గా పేరున్న ఆ నాయకుడు ఇప్పుడు సొంత పార్టీలోనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? స్వపక్షంలోనే విపక్షనేతగా మారుతున్నారా? అధికార పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నారా? అందుకే ఏకంగా ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేశారా? ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? ఆయన వేస్తున్న రివర్స్ గేరుకి కారణాలు ఏంటి?

ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. సిక్కోలు రాజకీయ వర్గాలు ఇప్పటికీ ఆయనను మంత్రిగారనే సంబోధిస్తారు. అలాటి నేత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే అంతటి సీనియర్ నేతకి సొంత క్యాడర్ నుంచే తలనొప్పులు వస్తుండడంతో ఒక్కసారిగా రోడ్డెక్కారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారులపైనే విరుచుకుపడుతున్నారు.

ఈ మధ్యకాలంలో ప్రెస్‌మీట్‌లో గాని, ఇతర సభల్లో గాని ఆయన మాట్లాడే తీరు అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుందట. ఎవరైనా మీటింగ్‌లు పెట్టాలంటే పార్టీ ఆఫీసులోనే పెట్టాలని డిప్యూటీ సీఎం తాఖీదులు ఇచ్చినా, వాటిని పట్టించుకోక సొంతంగా ఏర్పాటు చేసుకున్న టౌన్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు చేయడం వైసీపీ జిల్లా నాయకులకు మింగుడు పడడం లేదట. కాంట్రాక్టర్ల బాధలను ప్రస్తావిస్తూ ఓ రేంజ్‌లో అధికారులను టార్గెట్‌ చేసిన ధర్మాన స్వపక్షంలో ప్రతిపక్షంగా మారుతున్నారని క్యాడర్‌ మాట్లాడుకుంటోంది. కింద స్థాయి కేడర్‌లో అసహనం, సర్పంచ్‌గా గెలిచిన వాళ్లకు అధికారం లేకపోవడం, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సహ విగ్రహాలుగా ఉన్నారే తప్ప ప్రజలకు వీరి వల్ల ఏమి ఉపయోగం అనే అర్ధం వచ్చేలా మాట్లాడటంపై చర్చ జరుగుతోంది. కర్ర విరగకుండా పామును చంపే చందాన ఆయన ఇచ్చిన వివరణకు అటు అధికారపక్ష నేతలు తలలు పట్టుకుంటున్నారట.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ధర్మాన వైసీపీలో చేరాల్సి వచ్చింది. జగన్ పాదయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈయనే దగ్గరుండి స్వయంగా చూశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా నుంచి 8 సీట్లను గెలిచే విధంగా పథక రచన చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మానకు మంచి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా తన అన్న ధర్మాన కృష్ణదాసుకు పదవి వరించడం, మరో పక్క కొత్తగా ఎమ్మెల్యేగా అయిన అప్పలరాజు, తనతోటి వాడైన సీతారామ్‌కు స్పీకర్ పదవిని అధిష్టానం కట్టబెట్టడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. తనకు అవకాశం వస్తుందేమోనని వెయిట్ చేసిన ధర్మానలో అసహనం మొదలై ఇలా అధికార యంత్రాంగం తీరుపై వాటిని పట్టించుకోని నాయకత్వంపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆయన మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది.

ధర్మానను ఎలా కట్టడి చేయాలో తెలియక సొంత అన్న అయిన ధర్మాన కృష్ణదాసే ఊరుకుంటున్నారట. ఇదే విషయాన్ని కొందరు అధిష్టానం చెవిలో కూడా వేశారట. ధర్మాన ప్రసాదరావు ప్రెస్‌మీట్ పెట్టాలనుకుంటే పార్టీ కార్యాలయంలో పెట్టాలని కూడా హుకూం జారీ చేయాలని చెప్పారట. కానీ ప్రసాదరావు అనుయాయులు మాత్రం ధర్మాన చెప్పిన పాయింట్స్‌లో తప్పేమీ లేదంటూ వెనకేసుకొస్తున్నారట. ఆయన మాట్లాడిన మాటలేవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవని రివర్స్ కౌంటర్ వేస్తున్నారట.

ఏమైనా రాబోయే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుండుగా ప్రసాదరావు ఇలా మాట్లాడడం మంచిదా అని కొందరు అంటుంటే, ఇంకొందరు మాత్రం శభాష్ అంటున్నారట. సబ్జెక్టుపై గ్రిప్ ఉన్నవారిని అసెంబ్లీలో మంత్రిగా కూర్చొబెట్టాల్సిన బాధ్యత కూడా అధిష్టానంపై ఉందనే వాదన కూడా వినిపిస్తున్నారట. మొత్తానికి రాజకీయాల్లో సీనియర్‌ నేతగా ఏ విషయంపైనా సరే అనర్గళంగా మాట్లాడే ఓ మంచి వక్తను ఇలా ఖాళీగా ఉంచడం పార్టీకి మంచిది కాదని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో, జగన్‌ మదిలో ధర్మానపై ఎలాంటి అభిప్రాయం ఉందో వేచి చూడాలి.

Tags:    

Similar News