ఆ మూడు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి?

Update: 2019-08-02 06:37 GMT

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కరణం బలరాం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), కోలగట్ల వీరభద్ర స్వామిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా చూసుకుంటే మూడు స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక్కో స్థానానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీకి 23 మందే ఉన్నారు. ఇక వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం గట్టిగానే పోటీ నెలకొంది. ఈ మూడింటిలో ఒక స్థానాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సి ఉంది. మంత్రిగా ఎన్నికైన వెంకటరమణ ప్రస్తుతం ఏ సభలో సభ్యుడు కాదు. దీంతో ఆయనకు ఒక స్థానం రిజర్వు చేయాలి.

మరో స్థానాన్ని ముస్లింలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అందులో మాజీ పోలీస్ అధికారి మొహమ్మద్ ఇక్బాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గడిచిన ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక పార్టీలో చేరిక సమయంలో సినీనటుడు అలీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి అలీకి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవితో సరిపెట్టాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి, మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ తదితరులు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పాదయాత్ర సమయంలో కుంభా రవికి మొదటి దఫానే ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయనకు అరకు పార్లమెంటు పరిధిలో మంచి పట్టు ఉంది. ఏజన్సీలో పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యడంలో ఆయనది ముఖ్య పాత్ర.

ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన కీలకనేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అయన 2014 లో రాజంపేట నుంచి పోటీ చేసి మేడా మల్లికార్జునరెడ్డి చేతిలో ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల ముందు మేడా వైసీపీలో చేరడంతో రాజంపేట టికెట్ ఆయనకు దక్కింది. దీంతో అసంతృప్తిగా ఉన్న అమర్నాధ్ రెడ్డిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ లేదా టీటీడీలో కీలక పదవి ఇస్తానని జగన్ చెప్పినట్టు ప్రచారం జరిగింది.

ఇక వాసిరెడ్డి పద్మ అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఎమ్మెల్సీ స్థానంపై ఆమె ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమెకు ఎమ్మెల్సీ కన్నా కూడా.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రవిచంద్రారెడ్డి కూడా ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. 2019 ఎన్నికల ముందే పార్టీలో చేరిన ఆయన.. అనతికాలంలోనే పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ వాయిస్ ను సమర్ధవంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నేతల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు నెల్లూరుకు చెందిన పార్టీ కీలకనేత సపోర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరే కాక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, కర్నూల్ మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు సమాచారం. మరి జగన్ దృష్టిలో ఎవరు ఉన్నారో అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Tags:    

Similar News