Amaravati CRDA Meeting : అమరావతికి ఇక ఆకాశమే హద్దు.. సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో మారనున్న ఏపీ తలరాత

అమరావతికి ఇక ఆకాశమే హద్దు.. సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో మారనున్న ఏపీ తలరాత

Update: 2026-02-22 02:37 GMT

Amaravati CRDA Meeting : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 58వ సీఆర్డీఏ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. గత కొంతకాలంగా మందకొడిగా సాగుతున్న పనులకు జవసత్వాలు నింపుతూ, రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలకు ఈ భేటీలో ఆమోదం లభించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సూచించిన పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీఆర్డీఏ, అమరావతి రూపురేఖలను మార్చే దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బ్యాంకులు, రాజకీయ కార్యాలయాలకు స్థల కేటాయింపు

రాజధాని ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఆర్డీఏ ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా, అమరావతిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు పలు ప్రముఖ బ్యాంకులకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. అలాగే రాజకీయంగా కూడా అమరావతిని ప్రధాన కేంద్రంగా మారుస్తూ, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి స్థలాన్ని ఖరారు చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కేటాయింపుల ద్వారా రాజధానిలో పరిపాలనతో పాటు వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకోనున్నాయి.

హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలపై క్లారిటీ!

రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వీటి నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నింటినీ ఈ సమావేశంలో మంజూరు చేశారు. పనుల వేగం పెంచేందుకు ఈ ప్రాజెక్టుల బాధ్యతను AGICLకు బదిలీ చేస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం పరుగులు పెట్టనుంది. అలాగే నగరం నలుమూలలా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

అమరావతి గ్రీన్ అండ్ బ్లూ మ్యాజిక్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అమరావతిని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగరం అంతటా పచ్చదనం (గ్రీన్), నీటి వనరులు (బ్లూ) కలిపి ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్లను రూపొందించారు. కేవలం భవనాలే కాకుండా, ప్రపంచ స్థాయి పార్కులను ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇందుకోసం విదేశాల్లోని అత్యుత్తమ పార్కులపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రకృతి ఒడిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన నగరంగా అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags:    

Similar News