Weather Updates: మరో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు

Weather Updates: వరుస అల్పపీడనాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. జూలై నెలాఖరు నుంచి ప్రారంభమైన ఈ అల్పపీడనాలు ఒకటి ముగిసిన తరువాత మరొకటి వస్తున్నాయి.

Update: 2020-08-13 00:45 GMT
Heavy rains in AP (File Photo)

Weather Updates: వరుస అల్పపీడనాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. జూలై నెలాఖరు నుంచి ప్రారంభమైన ఈ అల్పపీడనాలు ఒకటి ముగిసిన తరువాత మరొకటి వస్తున్నాయి. వీటివల్ల ఏపీ మొత్తం తడిసి ముద్దవుతోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఏర్పడే అల్పపీడనం వల్ల మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. పలు మండలాలకు మధ్య సరిహద్దు రోడ్లు నీట మునిగాయి.

వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం బుధవారం ప్రకటించింది.

► ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ మినహాయించి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

► వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవారు అప్ర మత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు సిద్ధంగా ఉండాలని అధి కారులకు ఆదేశాలిచ్చారు.

ఏజెన్సీలో భారీ వర్షాలతో పొంగిన నదులు, వాగులు

► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో ఏజెన్సీ మండలాల్లో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

► విలీన మండలాలు.. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు వరద ముంపు పొంచి ఉంది.

► చింతూరు మండలంలో సోకిలేరు, జల్లివారి గూడెం వాగులు పొంగి రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య, చింతూరు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

► దేవీపట్నం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

► పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు మండలం చొదిమెళ్లకు కొద్దిదూరంలో చింతలపూడి ప్రధాన రహదారిలోని కల్వర్టు కోతకు గురై కూలిపోయింది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

► కాగా, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి.  

Tags:    

Similar News