Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం

Weather Report: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.

Update: 2021-06-10 05:57 GMT

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం

Weather Report: తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావాలతో ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రధానంగా ముంబైతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రజలు, స్థానిక సంస్థల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల 13 వరకు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, బెంగాల్‌, జార్ఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Tags:    

Similar News