ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీంతో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే ఇది క్రమంగా బలహీనపడుతోంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని 4 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గడచిన 24 గంటల్లో డోన్‌లో 9 సెంటిమీటర్లు, రాయచోటి, ఆత్మకూరు, లక్కిరెడ్డిపల్లి, విజయవాడలో 8 సెం.మీ. వర్షపాతం కురిసినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.