పోలవరం ఆగిపోడానికి టీడీపీ , వైసీపీ ఇద్దరూ బాధ్యులే : ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడానికి వైసీపీ, టీడీపీ రెండూ కారణమే అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు.

Update: 2020-10-30 05:50 GMT

ఏపీలో పోలవరం రగడ కొనసాగుతోంది. కేంద్రం ఇచ్చిన షాక్‌తో తప్పు మీదంటే మీదంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే పోలవరం పాపంలో రెండు పార్టీల పాత్ర ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో జరిగిన తప్పులే ప్రస్తుత పరిస్థితికి దారితీశాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఎప్పటికప్పుడు తప్పులను అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. పోలవరం నిర్మాణ ఖర్చు నూరు శాతం కేంద్రం ఇస్తుందనే అంశం చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. పోలవరం నిర్మాణం చట్టంలో ఉన్నా.. చంద్రబాబు ప్యాకేజీతో కాంప్రమైజ్ అయ్యారని విమర్శించారు ఉండవల్లి. పార్లమెంట్‌లో చేసిన చట్టం గొప్పదా చంద్రబాబు, మోదీ చేసుకున్న ఒప్పందం గొప్పదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ పోలవరం విషయంలో చేసిన తప్పులతో కేంద్రం ప్రాజెక్టును పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు.

చంద్రబాబు ప్రభుత్వం పంపిన 57 వేల 218 కోట్ల అంచనా వ్యయానికి 17 వందల 48 కోట్లు తగ్గించి కేంద్రమంత్రి ఆమోదించారని తెలిపారు ఉండవల్లి. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అప్పటి హోంమంత్రి షిండే పొలవరానికి నిధులిస్తామని పార్లమెంట్‌లో చెప్పినట్లు గుర్తుచేశారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని కేంద్రం మార్చలేదన్న ఉండవల్లి జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల్లో పోలవరం గురించి మాట్లాడిన జగన్ ఇప్పుడెందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.

కేంద్రం పోలవరంపై మాట మారుస్తున్నప్పుడు మోడీ కాలర్ పట్టుకోనక్కర్లేదు ఒక్క కేసు వేస్తే చాలని జగన్‌కు సూచించారు ఉండవల్లి. ఇప్పటికే రచ్చ రేపుతోన్న పోలవరం టాపిక్‌పై ఉండవల్లి చేస్తోన్న వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్‌ పుట్టించేలా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై పోరాటం చేస్తుందా కాంప్రమైజ్‌తో సైలెంట్‌ అవుతుందా.. చూడాలి మరి. 

Tags:    

Similar News