అధికారుల ముందుచూపు కరువు ప్రయాణికులకు ఛార్జీల బరువు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి వాసుల ఇక్కట్లు

* భారీ వాహనాలకు రెండేళ్లుగా నో పర్మిషన్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం

Update: 2022-11-26 02:55 GMT

విజయనగరం జిల్లా చీపురుపల్లి వాసుల ఇక్కట్లు

Vizianagaram: విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని ఆర్ఓబీ రెండు సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరింది. వంతెన ప్రమాద స్థాయిలో ఉందని భారీ వాహనాల రాకపోకలు నిలిపేయాలని రైల్వే అధికారులు ఆదేశించారు. దీంతో ఆ బ్రిడ్జి పైనుంచి అధిక బరువు ఉన్న వాహనాలను రెండు సంవత్సరాలుగా రాకపోకలను నిలిపేశారు. అయితే ఆరు నెలల క్రితం బ్రిడ్జి మరింత శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ద్విచక్రవాహనాలతోపాటు ఆటోలు, కార్లు తప్ప మరే ఇతర వాహనాలను వంతెన పైనుంచి అనుమతించడం లేదు బస్సుల రాకపోకలను కూడా నిలిపేశారు.

రాజాం, పాలకొండ ప్రాంత వాసులకు విశాఖపట్నానికి గానీ విజయనగరం గానీ వెళ్లాలంటే తిప్పలు తప్పడం లేదు. వంతెనకు ఇరువైపులా బస్సులను అపేయడంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు మారాలంటే నానా యాతన పడాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు. చీపురుపల్లి ఆర్ఓబీ పైనుంచి గత జూన్‌ నుంచి రాకపోకలు నిలిపేశారు. కానీ నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆరునెలలుగా ప్రయాణికులు అవస్థలు పడుతూనే ఉన్నారు. వంతెనపై రాకపోకలు నిలిపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని వంతెనపై బస్సుల రాకపోకలు నిలిపేయడంతో విశాఖపట్నం నుంచి విజయనగరం చీపురుపల్లి మీదుగా రాజాం, పాలకొండ, కొత్తూరు వైపు వెళ్లే బస్సులు శ్రీకాకుళం జిల్లాలోని చిలకపాలెం, పొందూరు మీదుగా రాజాం, పాలకొండ, కొత్తూరు చేరుకుంటున్నాయి. దీంతో ప్రయాణ సమయంతోపాటు ప్రయాణ చార్జీలు అధికమవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి ఆర్ఓబీపై వాహనాల రాకపోకలు నిలిపేయడంతో ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News