గ్యాంగ్ వార్.. సెటిల్ మెంట్లే సందీప్ హత్యకు కారణం.. ఇంకా 13 మంది అరెస్ట్ : విజయవాడ సీపీ
గత నెల 30న విజయవాడలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన వార్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
గత నెల 30న విజయవాడలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన వార్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ కేసులో పూర్తి సారాంశాన్ని విజయవాడ పోలీసులు వివరించారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కేసు వివరాలను తెలియజేశారు. నగరంలో ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ ఇద్దరూ మధ్య ఓ రియల్ ఎస్టేట్ వివాదం ఏర్పడింది. శ్రీధర్ నుంచి తనకు రావాల్సిన ఆస్తిని ఇప్పించాలంటూ ప్రదీప్ రెడ్డి బుట్టా నాగబాబు అనే వ్యక్తిని సంప్రదించాడు. ఆ బుట్టా నాగబాబుతో భేటీ సమయంలో ప్రదీప్, శ్రీధర్ బాబుతో పాటు సందీప్, పండు కూడా హాజరయ్యారు.
అయితే ఆ సమయంలో సందీప్, పండు మధ్య వివాదం చెలరేగింది. నాగబాబు తర్వాత డీలింగ్స్‌లో తాను సెటిల్ మెంట్ చేస్తుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావంటూ పండును సందీప్ అడిగాడు. ఈ సందర్భంగా వారిద్దరి 28న వివాదం జరిగింది. ఈ క్రమంలో మే నెల 29న రాత్రి పండు ఇంటికి వెళ్లిన సందీప్ అతడి తల్లితో గొడవకుదిగాడు. ఈ విషయం తెలుసుకున్న పండు ఆ తర్వాత మే 30న సందీప్‌కు చెందిన శివబాలాజీ స్టీల్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ సందీప్ లేడు. షోపిలో పని చేసే వారి మీద దాడి చేసి పండు గ్యాంగ్ వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన సందీప్ ఆగ్రహంతో పండుకి ఫోన్ చేసి గొడవ పడ్డాడు.
కాగా.. మే 30వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో పటమటలోని తోట వారి వీధిలో సందీప్, పండు గ్యాంగ్‌లు కత్తులు, బ్లేడ్లు, కారం, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సందీప్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ దాడిలో గాయపడిన పండు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వరకు 13 మందిని అదువులోకి తీసుకున్నట్లు విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. గతంలో సందీప్ మీద రౌడీషీట్ ఉండేదని, 2016లో హైకోర్టు ఓ తీర్పు ఇచ్చాక దాన్ని ఎత్తివేసినట్టు వెల్లడించారు.