ముఖ్యమంత్రి జగన్ దేశానికి దిశ చూపించారు: ఎంపీ వంగా గీత

మహిళ భద్రత కోసం 'దిశ చట్టం 2019' ని తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి దిశ చూపించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి వంగా గీత వ్యాఖ్యానించారు.

Update: 2019-12-15 09:26 GMT
ఎంపి వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

రాజమండ్రి: మహిళ భద్రత కోసం 'దిశ చట్టం 2019' ని తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి దిశ చూపించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం దిశ చట్టాన్ని చేసినందుకు కాకినాడ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకపోయినా మహిళ రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.

దీనికి రాష్ట్ర మహిళా లోకమంతా రుణపడి ఉంటుందన్నారు. అలాగే సోషల్‌ మీడియాలో మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా పోస్టింగులు పెట్టే వారికి కూడా ఈ చట్టం ద్వారా రెండు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష, అదే సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడి వంటి సంఘటనల విషయాల్లో ఉరి శిక్షను అమలు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దిశ చట్టం తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో దిశచట్టంపై జాతీయ స్థాయిలో మహిళా సదస్సును నిర్వహించడం ద్వారా కేంద్ర చట్టాల్లో కూడా మార్పులు తీసుకువచ్చే విధంగా ఒక డిక్లరేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. 


Tags:    

Similar News