వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం కోర్టుకు హాజరైన తర్వాత ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం కోర్టుకు హాజరైన తర్వాత ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరికొన్ని రోజులు వైద్య పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అధికారికంగా ఆసుపత్రి వైద్యుల నుంచి ఆరోగ్య వివరాలు వెలువడాల్సి ఉంది.
ఇక వంశీకి ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ ఆయన, ఇటీవలి కాలంలో పలు న్యాయపరమైన కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఫిబ్రవరి 13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో సహా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.
అయితే అన్ని కేసుల్లోనూ వంశీకి కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. అక్రమ మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించినా.. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. అలాగే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కోర్టు వంశీకి రూ.1 లక్ష పూచీకత్తుతో, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో, వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాల్సిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
ఇలా న్యాయపరమైన వ్యవహారాలతో పాటు, ఆరోగ్య సమస్యలు వల్లభనేని వంశీని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ విశ్రాంతిలో ఉన్నారు.