పడవ ప్రమాదంలో గల్లంతైన తులసిప్రియ మృతదేహం లభ్యం

Update: 2019-08-17 06:50 GMT

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెవిటికల్లుదగ్గర నాటుపడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన బాలిక మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు గుర్తించారు. లక్ష్మయ్యవాగులోని చెట్లపొదల్లో తులసిప్రియ డెడ్‌బాడీని గుర్తించిన అధికారులు బయటతీశారు. వరదలో కొట్టుకుపోయిన చిన్నారి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చెవిటికల్లుకు చెందిన రమేష్ తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని నాటు పడవ ఎక్కారు. పడవ లక్ష్మయ్య వాగు దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన గేదె బెదిరిపోయి పడవను ఢీ కొట్టంది. దీంతో పడవ బోల్తా పడింది. పడవలోంచి 5 గురు సురక్షింతగా బయటపడగా తులసిప్రియ నీటిలో కొట్టుకు పోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటినుంచి బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగించిన అధికారులు కొద్దిసేపటి క్రితం చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News