Anandayya Mandu: ఆనందయ్య మందు తయారీపై వెనక్కి తగ్గిన టీటీడీ

Anandayya Mandu: కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అనుమతులిస్తే చాలు తయారీకి సిద్ధమంటూ ప్రకటించిన టీటీడీ వెనక్కితగ్గింది.

Update: 2021-06-03 07:20 GMT

Anandayya Mandu: ఆనందయ్య మందు తయారీపై వెనక్కి తగ్గిన టీటీడీ

Anandayya Mandu: కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అనుమతులిస్తే చాలు తయారీకి సిద్ధమంటూ ప్రకటించిన టీటీడీ వెనక్కితగ్గింది. దేశమంతా సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉందని ప్రకటించిన పెద్దలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. జంతువులపై ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్‌ అంటూ ప్రకటనలు చేసిన టీటీడీ ఆయుష్ ప్రకటనతోనే అభిప్రాయం మార్చుకుందా..? మందు తయారీపై వెనుకడుగు వేయడానికి కారణాలేంటి..?

ఆనందయ్య మందును తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో తయారుచేయాలని తీసుకున్న నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సీసీఆర్ఏఎస్ నుంచి నివేదిక రాగానే ఔషధ తయారీకి సిద్ధమని తొలుత ప్రకటించిన టీటీడీ ఇప్పుడు పునరాలోచనల్లో పడింది. ఆనందయ్య మందు వాడుకకి అనుమతిస్తే ఔషధ తయారీకి సిద్ధమని టీటీడీ పాలక మండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఆయుర్వేద కళాశాల వైద్యులు, శాస్త్రజ్ఙులతో కృష్ణపట్నం వెళ్లిన ఆయన ఆనందయ్య కుటుంబీకులను పిలిపించి సమావేశమయ్యారు. టాక్సిక్ స్టడీ, జంతువులపై ప్రయోగాలు చేసేందుకు సిద్దమని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మందు తయారీపై ప్రారంభంలో వేగంగా స్పందించిన టీటీడీ ఇప్పుడు పునరాలోచనలో పడింది.

ఆనందయ్య ఔషధంపై కేంద్ర ఆయుర్వేద పరిశోధనామండలి - సీసీఆర్ఏఎస్ ఆదేశాలతో తొలిదశలో అభిప్రాయ సేకరణ చేశారు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్యులు. వారి నివేదికల ఆధారంగా హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీకి అనుమతులు ఇచ్చాయి. అయితే ఆనందయ్య తయారు చేసిన మందును ఆయుర్వేద ఔషధంగా గుర్తించలేమని ఆయుష్ తేల్చి చెప్పటంతో టీటీడీ తమ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

అయితే ఆనందయ్య మందుకు పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడటంతో ప్రభుత్వం, టీటీడీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు. శేషాచలం అడవుల్లో వన మూలికలు, ఆయుర్వేద ఆసుపత్రి వైద్య బృందం, శ్రీశ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు, నిపుణులూ అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం, టీటీడీ దృష్టి సారించి మందు తయారీ చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News