ఏపీ క్యాబినెట్ భేటీ.. అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకు సమాచారం

Update: 2020-01-19 02:53 GMT

రేపు ఉదయం 9 గంటలకు 10 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించనుంది. వికేంద్రీకరణకు సంబంధించి జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెంట్ కమిటీలు ఇచ్చిన నివేదికలను క్యాబినెట్ ఆమోదించనుంది. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా రేపటి క్యాబినెట్ సమావేశానికి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకు.. సీఎంఓ సమాచారం చేరవేసింది. ఇప్పటికే మంత్రులంతా విజయవాడకు చేరుకున్నారు.

ప్రస్తుతం అమరావతిలో ఉన్న పూర్తిస్థాయి రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రేపు ( సోమావారం) ఉదయం 9 గంటలకు 10 నిమిషాలకు సచివాలయంలో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. 10 గంటల వరకూ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశం సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం నివాసం, సచివాలయ పరిధిలో ఉన్న నివాసాలకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ముందస్తుగానే సమాచారం అందించాలని స్థానికులను పోలీస్ శాఖ వారు ఆదేశించారు.

మరోవైపు టీడీపీ ఆధ్వర్యంలో రేపు చలో అసెంబ్లీ నిరసన కార్యక్రమం జరగనుంది. చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని అమరావతి పొలిటికల్ జేఏసీ కన్వీనర్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని ధర్నాచౌక్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలిరావాలని ఒక ప్రకటనలో కోరారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు రేంజ్ ఐజీ బ్రిజిలాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదిలావుంటే పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్లే దారులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.  

Tags:    

Similar News