Tirupati Crime: తిరుపతిలో డెలివరీ బాయ్ దారుణం.. మహిళను చంపి, ఉరేసుకుని ఆత్మహత్య!
Tirupati Crime: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.
Tirupati Crime: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తనతో సంబంధం వద్దన్న కోపంతో ఒక వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేసి, ఆపై తానూ ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్యాస్ డెలివరీ పరిచయంతో మొదలైన బంధం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విభేదాల కారణంగా విడిపోయి, కొర్లగుంట మారుతీనగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే క్రమంలో అతనికి జీవకోనలో నివసించే లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి, తన భర్త మరియు కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం తిరుపతికి వలస వచ్చి బస్టాండ్ సమీపంలోని ఒక సమోసా షాపులో పనిచేస్తోంది.
వద్దన్నందుకు కక్ష పెంచుకున్నాడు
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని తెంచుకోవాలని లక్ష్మి నిర్ణయించుకుంది. "మన బంధం ఇక వద్దు.. నన్ను ఇబ్బంది పెట్టకు" అని సోమశేఖర్‌కు తేల్చి చెప్పింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సోమశేఖర్, 'చివరిసారిగా మాట్లాడుకుందాం రా' అని నమ్మించి సోమవారం తన గదికి పిలిపించాడు.
కిరాతక హత్య.. ఆపై బలవన్మరణం
మాటల మధ్యలో గొడవ జరగడంతో సోమశేఖర్ కోపంతో ఊగిపోయాడు. ఇంట్లోని కత్తితో లక్ష్మి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక, తాను చేసిన తప్పుకు భయపడి అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పక్క గదిలో ఉంటున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.