Nara Lokesh: విశాఖకు ‘క్యాప్ జెమినీ’? 20 వేల ఉద్యోగాలే లక్ష్యం.. సీఈఓతో లోకేష్ కీలక భేటీ!

Nara Lokesh: విశాఖపట్నాన్ని దేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

Update: 2026-03-12 07:25 GMT

Nara Lokesh: విశాఖకు ‘క్యాప్ జెమినీ’? 20 వేల ఉద్యోగాలే లక్ష్యం.. సీఈఓతో లోకేష్ కీలక భేటీ!

Nara Lokesh: విశాఖపట్నాన్ని దేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో క్యాప్ జెమినీ సంస్థ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ఐటీ రంగ అభివృద్ధి, కొత్త కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నం వేగంగా ఐటీ మరియు డేటా సెంటర్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయని గుర్తు చేశారు. అలాగే మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో విశాఖపట్నానికి అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత బలపడుతుందని తెలిపారు.

విశాఖలో అన్ని విధాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న మంత్రి లోకేష్, సుమారు 20 వేల ఉద్యోగాలకు అవకాశమున్న ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని క్యాప్ జెమినీ సంస్థను ఆహ్వానించారు...జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాలను కూడా విశాఖలో స్థాపించాలని కోరారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి వంటి రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్‌ను రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు...

ఇక క్వాంటం టెక్నాలజీ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు క్యాప్ జెమినీ సంస్థ సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు...క్వాంటం వ్యాలీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మాట్లాడుతూ తమ సంస్థ 1967లో పారిస్ కేంద్రంగా స్థాపించబడిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అందులో సుమారు 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని చెప్పారు. స్ట్రాటజీ, క్లౌడ్, డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో తమ సంస్థ సేవలు అందిస్తున్నట్లు వివరించారు. భారతదేశంలోని 13 నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. క్యాప్ జెమినీ సంస్థ వార్షిక ఆదాయం సుమారు 23.9 బిలియన్ డాలర్లుగా ఉంది.

Tags:    

Similar News