Mahanadu 2025: నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు
Mahanadu 2025: నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగనుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్నతొలి మహానాడును మూడురోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. మూడో రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కడపలో సోమవారం ఆకాశం మేఘావ్రుతమై చిరుజల్లులు పడుతున్ననేపథ్యంలో ఒక వేళ వర్షం కురిసినట్లయితే మహానాడు నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగి ప్రక్రియ. ఈసారి దానికి కొంత భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆరు ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చించనున్నారు. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం పేద ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి.
మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. మొదటిరెండు రోజులూ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.