రుతుపవనాలు : చల్లబడిన వాతావరణం

Update: 2020-06-09 01:37 GMT

గత రెండు రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిన జనం సోమవారం రాత్రి నుంచి ఒక్కసారే చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఈ రెండు రోజుల్లో కోస్తాంద్ర దిశగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీనిని ద్రువీకరిస్తూ సోమవారం రాత్రి గాలులతో కూడిన చిరు జల్లులు పడటంతో రైతుల్లో ఆశ చిగురించింది. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురిసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. జూన్‌ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులుపడే అవకాశం ఉందని తెలిపింది. జూన్‌ 10, 11, 12 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది 

Tags:    

Similar News