Dollar Seshadri: డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dollar Seshadri: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన పేరంటే తెలియని భక్తులు ఉండరు.

Update: 2021-11-29 11:17 GMT

Dollar Seshadri: డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dollar Seshadri: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన పేరంటే తెలియని భక్తులు ఉండరు. వీఐపీలు, వీవీఐపీల సంగతైతే చెప్పనక్కర్లేదు ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా..? ఆయనే డాలర్‌ శేషాద్రి.

1948 జూలై 15న జన్మించారు డాలర్‌ శేషాద్రి. ఆయన అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పొడువైన డాలర్‌ ధరించి వుండటంతో డాలర్‌ శేషాద్రిగా ప్రసిద్ధి చెందారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ట్రంలోని కంచి కాగా తిరుపతిలోనే జన్మించారు. విద్యాభ్యాసాన్ని కూడా తిరుపతిలోనే పూర్తి చేశారు. పీజీ పూర్తికాగానే చంద్రను వివాహం చేసుకున్నారు ఆ‍యన. వీరికి పిల్లలు లేరు. ఇక శేషాద్రికి ఇద్దరు అన్నలు, చెల్లెల్లు ఉన్నారు.

1978వ ఏడాది టీటీడీలో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించారు డాలర్‌ శేషాద్రి. 1979లో ఉత్తర పారపత్తేధార్‌గా టీటీడీలో రెగ్యులర్‌ ఉద్యోగి అయ్యారు. జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది, 2006 జూలైలో పార్‌ పత్తేదార్‌గా రిటైరైయ్యారు. అయితే ఆయనకున్న అపార అనుభవం దృష్ట్యా అప్పటి టీటీడీ పాలకమండలి రెండేళ్లపాటు డాలర్‌ పదవికాలాన్ని పొడిగించింది. 2007లో ఆలయ ఓస్డీగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

పాలకమండలి ఛైర్మన్‌గా పనిచేసిన ఆదికేశవులనాయుడు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి కూడా డాలర్‌ పదవి కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించింది. అయితే 2009లో డాలర్‌కు ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన మాగంటి గోపాల్‌ రెడ్డి టీటీడీలో 60 ఏళ్ళకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు సూచనతో శేషాద్రితోపాటు సుమారు 58 మందిని టీటీడీ విధుల నుంచి తప్పించింది.

ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు డాలర్‌ శేషాద్రి. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టులో పరిష్కరించుకోవాలంది. దీంతో హైకోర్టులో డాలర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2010 అక్టోబర్‌ 1న శేషాద్రిని విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. తర్వాత వచ్చిన బాహిరాజు నేతృత్వంలోని పాలకమండలి కూడా రెండు సార్లు డాలర్‌ పదవికాలని పొడిగించగా, ఆతర్వాత స్పేసిఫైడ్‌ అథారిటీ ఉన్న సమయంలో ఈవోగా పనిచేసిన ఎంజీ గోపాల్‌ తదుపరి ఉత్తర్వులు వెలుబడే వరకు ఆయన పొడిగింపు ఇవ్వడంతో ఇప్పటివరకూ డాలర్‌ శేషాద్రి ఆలయ ఓస్డీగా విధుల్లో కొనసాగారు.

స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. అంతేకాదు ప్రముఖులు ఎవరైనా తిరుమల వస్తే డాలర్‌ శేషాద్రి కచ్చితంగా అక్కడ ఉండేవారు. పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి వస్తే ఆయన దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు.

1987లో మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో పూజా కైంకర్యాల నిర్వహణలో టీటీడీకి ఎంతో సహాయం అందించారు డాలర్‌ శేషాద్రి. శ్రీవారి వాహనసేవలప్పుడు స్వామివారిని ఏవిధంగా అలంకరించాలో కూడా అర్చకులకు చెప్పేవారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించి చేస్తున్న మార్పుల్లో కూడా శేషాద్రి తన సహాయాన్ని టీటీడీకి అందిస్తున్నారు. ఇలా శ్రీవారి ఆలయంలో డాలర్‌ శేషాద్రి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

2006లో డాలరు శేషాద్రిపై శ్రీవారి ఆలయంలో 300 బంగారు డాలర్ల మిస్సింగ్‌ అభియోగం మోపబడినప్పటికీ విచారణలో సచ్చిలుడుగా బయటపడ్డారు. స్వామిసేవలో ఉన్నప్పుడే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు శేషాద్రి. 2013లో కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేసుకున్న శేషాద్రి 2016లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన 42 ఏళ్ళ సర్వీస్‌లో దాదాపు 15 నెలల కాలం మినహా మిగతా సమయమంతా శేషాద్రి స్వామి సేవలోనే తరించారు.

డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు రమణ దీక్షితులు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరంచిన ధన్యజీవి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక డాలర్ శేషాద్రి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని ప్రత్యేక రీతిలో స్వామివారికి సేవ చేసుకున్నారని కొనియాడారు. శేషాద్రితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు బాలసుబ్రహ్మణ్యం. ఇక వెంకటాద్రిలో జన్మించి సింహాద్రిలో ప్రాణాలు విడిచిన డాలర్‌ శేషాద్రి అకాల మరణం పట్ల టీటీడీ అధికారులతోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News