Sankranti special trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక హాల్ట్‌లు, టికెట్ డిస్కౌంట్

సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక హాల్ట్‌లు, రైల్‌వన్ యాప్‌లో 3% డిస్కౌంట్ ప్రకటించింది.

Update: 2026-01-06 10:40 GMT

Sankranti special trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక హాల్ట్‌లు, టికెట్ డిస్కౌంట్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇంటికి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగర పరిధిలోని హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో మొత్తం 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా నిలుపుదల (హాల్ట్) కల్పించనున్నారు. ఈ ప్రత్యేక సౌకర్యం జనవరి 7 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సంక్రాంతికి ఇంటికి వెళ్లే ప్రయాణికులు, తిరిగి నగరానికి వచ్చే ఉద్యోగులు ఈ హాల్ట్‌లను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

హైటెక్ సిటీ స్టేషన్‌లో మొత్తం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్‌ను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం–బీదర్, నర్సాపూర్–లింగంపల్లి, లింగంపల్లి–విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ–లింగంపల్లి గౌతమి, విశాఖపట్నం–ముంబయి ఎల్‌టీటీ, ముంబయి–విశాఖపట్నం వంటి పలు కీలక రైళ్లు ఇందులో ఉన్నాయి. ఈ ఏర్పాటుతో నగరంలోని ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు సులభంగా రైళ్లను చేరుకునే అవకాశం లభించనుంది.

అదే విధంగా చర్లపల్లి స్టేషన్‌లో మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించారు. సికింద్రాబాద్–గూడూరు సింహపురి, హైదరాబాద్–విశాఖపట్నం గోదావరి, తిరుపతి–సికింద్రాబాద్ పద్మావతి, సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ, సికింద్రాబాద్–విశాఖపట్నం గరీబ్‌రథ్ వంటి రైళ్లు చర్లపల్లిలో ఆగనున్నాయి. దీంతో తూర్పు దిశగా ప్రయాణించే వారికి ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ప్రయాణికులకు మరో శుభవార్తగా దక్షిణ మధ్య రైల్వే ‘రైల్‌వన్’ యాప్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేసే వారికి 3 శాతం రాయితీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జూలై 14, 2026 వరకు అమల్లో ఉంటుంది. రైల్‌వన్ యాప్ ద్వారా రిజర్వుడ్ టికెట్లు, అన్‌రిజర్వుడ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు సైతం పొందవచ్చని వెల్లడించారు.

సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని సాఫీగా నిర్వహించేందుకు ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News