Ramatheertham Incident: రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు

Ramatheertham Incident: రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచింది.

Update: 2021-01-06 03:18 GMT

Representational Image

రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచింది. ఉత్తరాంద్రనే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా రామతీర్థం వ్యవహారంలో వైసీపీ, టీడీపీ, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ,టీడీపీ, బీజేపీ నేతల పర్యటనతో రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘటన జరిగిన నాటి నుంచి ఉత్తరాంధ్రలో అగ్ని జ్వాల రగులుతోంది.

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్ధం రామాలాయం చుట్టూ తిరుగుతున్నాయి. రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహ ధ్వంసం రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికారణంగానే ఘటన జరిగిందని ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తుండగా ఘటన వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఎవరికి వారు తమ పార్టీ నేతలతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు బీజేపీ నేతలు రామతీర్దంలో పర్యటించారు. నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు పరిస్థితిని అదుపుచేయడం తలనొప్పిగా మారింది.

రామతీర్థం వెళ్తున్న బీజేపీ ,జనసేన నాయకులను,కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడంతో ఆ పార్టీల నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్నినిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు.13 జిల్లాలోని ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. రామతీర్థానికి వైసీపీ, టీడీపీ నేతలను అనుమతించిన విధంగానే బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రమేయంతోనే రామతీర్థం ఘటన జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే ఒకటి రెండు రోజుల ముందే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాష్ర్ట మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం చేయడం వలన తమ పార్టీకి ప్రయోజనం లేదని ప్రతిపక్ష పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి అప్పలరాజు అన్నారు.

రాముడి విగ్రహం ధ్వంసంపై సీఎం జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దేవుళ్ళతో పెట్టుకుంటే తండ్రికి పట్టిన గతే తనయుడికి పడుతుందని అన్నారు. జగన్ కి ప్రజలలో వ్యతిరేకత మొదలైందని అందుకే రామతీర్ధంలో విజయసాయి రెడ్డి పై ప్రజలు దాడి చేసారని అన్నారు.

రామతీర్థం ఘటనపైసాధువులు,స్వామీజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ సాధూ పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూడలేక రాజకీయ కుట్రతో దాడులు చేస్తున్నారని బాలబ్రహ్మానంద సరస్వతి అభిప్రాయపడ్డారు.

ఓ వైపు భూ వివాదాలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లిపోతుండగా తాజాగా రామతీర్థం వివాదం ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి నిజమైన దోషులను శిక్షించాలని ఉత్తరాంద్రవాసులు కోరుతున్నారు.  

Tags:    

Similar News