Tirumala: తిరుమలలో పాముకాటు ప్రచారం.. అసలు నిజం ఇదీ!
TTD Fact Check: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తురాలు పాముకాటుకు గురైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా ఖండించింది.
Tirumala: తిరుమలలో పాముకాటు ప్రచారం.. అసలు నిజం ఇదీ!
TTD Fact Check: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తురాలు పాముకాటుకు గురైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సోషల్ మీడియా వేదికగా అసలు ఏం జరిగిందో వివరించింది.
అసలేం జరిగింది?
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. ఎస్వీ మ్యూజియం సమీపంలోని పార్కింగ్ ఏరియా వద్ద కారు దిగిన మౌనిక, తన కాలికి పసుపు రాసుకుంటుండగా ఏదో వస్తువు తగిలినట్లు అనిపించి భయంతో కేకలు వేశారు. అక్కడ ఒక పాము పిల్ల కనిపించడంతో ఆమె పాముకాటుకు గురై ఉండవచ్చని అందరూ భావించారు.
వైద్యుల నిర్ధారణ:
వెంటనే అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎటువంటి గాయం కాలేదని, పాము కుట్టలేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) ఆస్పత్రికి తరలించగా, అక్కడ కూడా పరీక్షల అనంతరం ఆమె పాముకాటుకు గురికాలేదని వైద్యులు నిర్ధారించారు. కంటికి కనిపించిన ఆ పాము పిల్ల కూడా విషపూరితమైనది కాదని స్పష్టమైంది.
దర్శనం చేసుకున్న దంపతులు:
తమ పట్ల తక్షణమే స్పందించి సహాయం చేసిన టీటీడీ అధికారులకు, సిబ్బందికి శరత్ బాబు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం వారు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల భద్రత పట్ల టీటీడీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.