AP Inter Exams : ఏపీలో ఇంటర్ పరీక్షలు షురూ.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఏపీలో ఇంటర్ పరీక్షలు షురూ.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Inter Exams : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు నేడు (ఫిబ్రవరి 23) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా, రేపు సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇందులో 5.31 లక్షల మంది ప్రథమ సంవత్సరం వారు కాగా, 5.26 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పటిష్టమైన కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.
ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 1.02 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. గత ఏడాది 2025లో ఈ జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించడంతో, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని విద్యార్థులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే, నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. పరీక్ష సమయానికి 'ఒక్క నిమిషం ఆలస్యమైనా' లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేయడంతో, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. కాపీయింగ్‌కు తావులేకుండా ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని నేరుగా ఆర్‌ఐవో మరియు ఇంటర్ బోర్డు కార్యాలయాలకు అనుసంధానం చేయడం విశేషం. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లు, ఇతర ప్రాంతాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతరం నిఘా ఉంచుతాయి. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా నియమించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు, ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే తక్షణ చికిత్స అందించేందుకు ప్రాథమిక చికిత్స కిట్లను సిద్ధం చేశారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1531 కు ఫోన్ చేయవచ్చని బోర్డు సూచించింది. నేడు ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతాయి.