Rain Alert: ఏర్పడనున్న అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు

Update: 2020-08-03 03:45 GMT

Rain Alert:గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణం అనకూలంగా ఉంది. ఖరీఫ్ సీజను ముందు నుంచి అడపా, దడపా వర్షాలు కురుస్తుండటంతో ఇటు ప్రజలు, అటు రైతులు ఆనందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో దాని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగష్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో రాగాల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

ఉత్తర కోస్తాంధ్రా, యానాం: ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కోస్తాంధ్రాలోని పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణ కోస్తాంధ్రా: ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఈ సంవత్సరం వాతావరణం అనకూలించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు ఖరీఫ్ వరి నాట్లు పూర్తిచేశారు. ఈ రెండు, మూడు రోజులు కురిసే వర్షాలకు మిగిలినవన్నీ పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఖరీఫ్ పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటే ఏపీ తిరుగులేని దిగుబడి సాధిస్తుందని లెక్కలు వేస్తున్నారు.

రాయలసీమ: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఇక అటు తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

Tags:    

Similar News