Raghurama krishnam raju issue in YSRCP: రాజుగారి రగడ క్లైమాక్స్‌ ఎలా వుండబోతోంది?

Raghurama krishnam raju issue : పొమ్మనలేక పొగపెడుతున్నారు...ఇది నిన్నటి మాట. పోతాను పొగపెట్టమంటున్నారు ఇదీ నేటి మాట. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే అన్నట్టుగా, తికమక పెడుతూ, మకతిక పెడుతూ, పొలిటికల్ పండితులకే పిచ్చెక్కిస్తున్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

Update: 2020-06-26 12:09 GMT

పొమ్మనలేక పొగపెడుతున్నారు...ఇది నిన్నటి మాట. పోతాను పొగపెట్టమంటున్నారు ఇదీ నేటి మాట. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే అన్నట్టుగా, తికమక పెడుతూ, మకతిక పెడుతూ, పొలిటికల్ పండితులకే పిచ్చెక్కిస్తున్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. సైరా అంటూ ట్విట్టర్‌ పంచ్‌లు విసిరే విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీస్‌కే, సై సైరా అంటూ రివర్స్‌ కౌంటర్ ఇచ్చారు రఘురామ. పార్టీ పేరునే ప్రశ్నించారాయన. వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారని, ఎవ్వరికైనా ఇట్టే తెలిసిపోతుంది. మరి ముసుగులో ఈ తన్నులాట ఏంటి? రాజు, వైసీపీ అధిష్టాన పెద్దలూ క్లారిటీ వున్నప్పుడు, ఎక్కడ మిస్సవుతోంది క్లారిటీ? ఇద్దరికీ పక్కాగా వున్న ఆ లెక్కేంటో, ఒక్కసారి లుక్కేయండి.

వైసీపీ ఎంపీ రఘరామకృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని ఈ పేరు, ఇప్పడు వైసిపి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎప్పుడు ఏం చెయ్యబోతున్నారో, ఏ ట్విస్ట్ ఇవ్వబోతున్నారో అనే ఆసక్తి పొలిటికల్ విశ్లేేషకులకు సైతం అంతుపట్టడంలేదు. కలహాల కాపురంలో కలతలకు కారణం మీరే...వివరణ ఇవ్వండి అంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్మి విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ, పార్టీ తరపున షోకాజ్ నోటీసు ఇస్తే.. ఆ నోటీసు అందుకున్న రఘరామకృష్ణంరాజు రివర్స్ లో విజయసాయిరెడ్డికి ఇచ్చిన కౌంటర్ ఎవరూ ఊహించి ఉండరు. అంతలా సొంత పార్టీ మనుగడనే ప్రశ్నిస్తూ ఎర్ర జెండా ఎత్తారు రఘరాముడు.

వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్మి విజయసాయిరెడ్డికి మూడే మూడు సూటి పశ్నలు.. అంటూ అందరికీ ట్విట్‌లతో కౌంటర్ ఇచ్చే సాయిరెడ్డికే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు రాజు. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన వైసిపిలో మీరు జాతీయ ప్రధాన కార్యదర్మి ఎలా అవుతారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు చట్టబద్దతే లేదంటూ మరో ప్రశ్న సంధిండం వెనుక మర్మం చూస్తే పార్టీతో ఢీ అన్నట్లే ఉంది రాజుగారి తీరు. క్రమశిక్షణా సంఘం ఉందా నన్ను ప్రశ్నించడానికి అంటూ లేవనెత్తిన ప్రశ్నలు పార్టీ అంతర్గత విషయాలను బట్టబయలు చేసేలా ఉన్నాయి. ఇలా ఒకటేమిటి ఎంపీ రఘరామ కృష్ణంరాజు విజయసాయిరెడ్డికి సంధించిన ప్రశ్నలు, సైరా అంటూ కోటరికీ సవాలు విసిరేలా ఉన్నాయడంలో ఏమాత్రం సందేహంలేదు. తాను మాట్లాడాలనుకున్నది మా నాయకుడితో పార్టీలో, పథకాల్లో జరుగుతున్న లోపాలు చెప్పాలనుకున్నది అధినేతతో మధ్యలో మీరు అడ్డు తగులుతున్నారు మళ్లీ మీరే నన్ను ప్రశ్నిస్తే ఎలా అంటూ రెచ్చిపోయారు రఘరాముడు. విజయసాయిరెడ్డితో మొదటి నుంచి రఘురామకు పడదు. అందుకే ఈస్థాయిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారనేది విశ్లేషకుల మాట.

రఘురామ అయితే చాలా క్లారిటీగా వున్నారు. ఇక వైసీపీతో తాడోపేడో తేల్చుకోవాలని. అందుకే ఏకంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని మాత్రమే వుండాలి కదా, అని పార్టీ ఉనికిని, పేరునే ప్రశ్నించారు. నౌ డౌట్. ఇది ధిక్కారమే. పార్టీ కార్యక్రమాలు, పథకాలు, విధానాలపై విమర్శలు, ఆరోపణలు వేరే. కానీ పార్టీ పేరును ప్రశ్నించాల్సిన అవసరమేంటన్నది, అదే పార్టీ నేతల మాట. ఇది ఒకరకంగా పార్టీ అధినేతను అనడమే. కానీ జగనంటే నాకు విపరీతమైన ప్రేమ, అభిమానం, సస్పెన్షన్ వేస్తే తట్టుకోలేనంటూ మాట్లాడిన మాటలు, వెటకారమే అనుకోవాలి. మరి ముసుగులో గుద్దులాట ఎందుకు? నేరుగా వైసీపీకి రాజీనామా చేయొచ్చు కదా అనే వారున్నారు. కానీ అది రాజుగారికే నష్టం. అదే ఒకవేళ పార్టీకే విపరీతమైన కోపం వచ్చి, సస్పెన్షన్ వేస్తే రఘురామకు పండగే. ఎందుకంటే, సస్పెన్షన్ వేటు వేసిన మరుక్షణమే ఆయన స్వతంత్ర సభ్యుడవుతారు. కమలంతో జట్టుకట్టడానికి లైన్‌ క్లియర్ అవుతుంది. లోక్‌సభలో వైసీపీకి ఒక నెంబర్‌ పడిపోయి, బలం తగ్గుతున్న నష్టమే తప్ప, లాభం లేదు. రాజుగారికే లాభం. అందుకే ఎలాగైనా పార్టీతో సస్పెన్షన్ వేటు వేయించుకోవాలని, రకరకాలుగా సతాయిస్తున్నట్టు రఘురామ వ్యంగ్యాస్త్రాలను బట్టి అర్థమవుతోంది. అటు వైసీపీకి కూడా క్లారిటీ వుంది. సస్పెన్షన్ వేస్తే, లాభం లేదని. మరి ఇలాగే టామ్‌ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే వుంటారా ఏదో రకంగా ఎండ్‌కార్డ్ వేస్తారా అన్నది, కాలమే సమాధానం ఇవ్వాలి. అంతవరకు టామ్‌ అండ్‌ జెర్రీ ఎపిసోడ్స్‌ కంటిన్యూ.

Full View


Tags:    

Similar News