Hanuman Birthplace: మరోసారి హాట్‌టాపిక్‌గా హనుమాన్ జన్మస్థలి

Hanuman Birthplace: హనుమాన్‌ జన్మస్థలం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

Update: 2021-05-27 05:28 GMT

మరోసారి హాట్‌టాపిక్‌గా హనుమాన్ జన్మస్థలి

Hanuman Birthplace: హనుమాన్‌ జన్మస్థలం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఓ వైపు టీటీడీ ప్రకటన మరోవైపు హనుమద్‌ జన్మభూమి ట్రస్ట్ అభ్యంతరంతో వాయుపుత్రుడి జన్మస్థలిపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ఈ వివాదంపై టీటీడీ, హనుమద్ జన్మస్థలి ట్రస్ట్ బహిరంగ చర్చకు సిద్ధమవడంతో ఈ చర్చల్లో ఏం డిసైడ్ కాబోతుందనేది ఉత్కంఠగా మారింది.

అంజనాద్రిని హనుమాన్ జన్మస్థలమని టీటీడీ ప్రకటించగా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది శ్రీహనుమద్ జన్మభూమి ట్రస్ట్‌. ఈ విషయంపై నేడు తిరుపతి సంస్కృత విద్యా పీఠంలో చర్చ జరగనుంది. టీటీడీతో చర్చకు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధమైంది. ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి పాల్గొననుండగా టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటారు.

కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీవారు కొలువైన తిరుగిరుల్లోని అంజనాద్రి, జాపాలి హనుమాన్ దివ్యక్షేత్రమే ఆంజనేయుడి జన్మస్థలంగా శ్రీరామనవమి రోజున టీటీడీ ప్రకటన చేసింది. అయితే హంపి కిష్కింధ సంస్థానం చర్చకు సిద్ధమైంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన శ్రీహనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ గోవిందానంద సరస్వతి టీటీడీ కమిటీని చర్చకు ఆహ్వానించారు.

ఇప్పటికే రెండుసార్లు టీటీడీ ప్రకటనపై లేఖలను రాశారు శ్రీ గోవిందానంద సరస్వతి. అయితే దానికి టీటీడీ బహిరంగంగా సమాధానం ఇవ్వలేదు. దీంతో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన సమయాన్నే చర్చ కోసం వినియోగించుకోవాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని టీటీడీకి సమాచారం ఇవ్వగా ఇవాళ ఉదయం 10 గంటలకు చర్చలకు సిద్ధం కావాలని ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్చల ద్వారా హనుమంతుడి జన్మస్థలంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ తొందరపడిందని శ్రీ గోవిందానంద స్వామి అభిప్రాయపడ్డారు. హనుమాన్ జన్మస్థలాన్ని తిరుమల జాపాలిగా ప్రకటించడం తొందరపాటే అని ఆయన అన్నారు. అయితే, తమ దగ్గర చారిత్రక, పురాణ, భౌగోళిక ఆధారాలు ఉన్నాయంటోంది టీటీడీ. దాంతో, హనుమాన్ జన్మస్థలంపై చర్చకు రావాలంటూ టీటీడీకి శ్రీగోవిందానంద సరస్వతి స్వామి సవాల్ విసిరారు. ఇప్పుడు ఇరువురి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News