తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* రాష్ట్రపతిని ఘనంగా స్వాగతించిన అధికారులు

Update: 2022-12-05 02:14 GMT

తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Madam President: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అధికార హోదాలో మొదటిసారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంటకు చేరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తొలుత వరాహస్వామిని దర్శించుకుంటారు.

ఆ తర్వాత 9 గంటల 40 నిమిషాలకు స్వామి వారిని దర్శించుకుంటారు. ఉదయం 11 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి 11 గంటల 35 నిమిషాలకు అలిపిరిలో టీటీడీ నిర్వహిస్తున్న గోమందిరాన్ని సందర్శిస్తారు. తర్వాత 11 గంటల 55 నిమిషాలకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు, అధ్యాపకులతో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి ఒంటి గంటా 40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు. 

Tags:    

Similar News