Nilam Sahni: ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని వద్దంటూ హైకోర్టులో పిల్

AP Election Commissioner 2021: ఎపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని కొనసాగించొద్దు అంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

Update: 2021-06-20 07:16 GMT

AP SEC Neelam Sahni: (File Image)

Nilam Sahni: ఏపీ ప్రభుత్వానికి రాజకీయ విధేయురాలిగా ఉంటూ... ప్రజాధనం వృధా చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నీలం సాహ్నిపై ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ ఈ పిటిషన్ వేశారు. పరిషత్ ఎన్నికలను సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గడువిచ్చి నిర్వహించాలని తెలిసినా.. కావాలని రాజకీయ కారణాలతో ముందే నిర్వహించారని.. ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిందని.. ఆ ఎన్నికల కోసం ఖర్చయిన ప్రజాధనం రు.160 కోట్లు నీలం సాహ్ని నుంచి వసూలు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

అంతే కాదు ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టేందుకు వీలుగా రూ.160 కోట్లకు బ్యాంక్‌ పూచీకత్తు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో నీలం సాహ్నిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నీలం సాహ్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీ రంగులు తొలగించాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎస్‌గా ఉన్నప్పుడు కోర్టుకు హామీ ఇచ్చిన నీలం సాహ్ని.. అందుకు కట్టుబడి వ్యవహరించలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఎస్‌ఈసీగా కొనసాగడాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

Tags:    

Similar News