స్థానిక సంస్థల ఎన్నికల వేళ లో ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీ గుడ్ బై చెప్పారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ లు కూడా టీడీపీ వీడారు. త్వరలో అనుచరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరనున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు మీద 8 వేల ఓట్లతో విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు విశాఖలో పర్యటించే సమయంలో కూడా ఆయన పెద్దగా పాల్గొనలేదు.
గత ఆరునెలలుగా వైసీపీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా రమేష్ బాబు ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలు పార్టీని వీడారు. మంగళవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలావుంటే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీలో చేరనున్నారు.