Tirumla: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!!
Tirumla: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. తొలిరోజు 20 గంటలపాటు దర్శనం..!!
Tirumla: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి అర్ధరాత్రి నుంచి అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకు ఏవిధంగా ఇబ్బందులు రాకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ మహోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయంలోని బంగారు వాకిలిని తిరుప్పావై పాశురాల నడుమ శాస్త్రోక్తంగా తెరుస్తారు. ఈ ఘట్టం వైకుంఠ ద్వార దర్శనాలకు నాంది పలుకుతుంది.
వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న తర్వాత తొలుత రాత్రి 1.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. అనంతరం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఈ-డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు.
టీటీడీ అంచనా ప్రకారం జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రద్దీ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. స్వామి దర్శనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
కాగా క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం పులిహోరా, చక్కెర పొంగలి, దద్దోజనం వంటి 16 రకాల ఆహారాలను సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో తెలిపారు. మొదటి మూడు రోజులు 24 గంటలు అన్న ప్రసాదాలు, వేడి పానీయాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధంగా ఉంటాయి. నిత్యం 4.30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. లడ్డూ కౌంటర్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు డిజిటల్ పేమెంట్ కియోస్క్ లు ఏర్పాటు చేశారు. నగదు రహితంగా స్లిప్పులు పొంది డైరెక్టుగా లడ్డూలు తీసుకోవచ్చు.