Antarvedi : వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
Antarvedi Rathotsavam 2025: అంతర్వేదిలో లక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథోత్సవ ఆద్యంతం అంతర్వేది పురవీధులు గోవిందనామస్మరణతో మార్మోగాయి.
Antarvedi : వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
Antarvedi Rathotsavam 2025: అంతర్వేదిలో లక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథోత్సవ ఆద్యంతం అంతర్వేది పురవీధులు గోవిందనామస్మరణతో మార్మోగాయి. అంతర్వేది ఆలయ చైర్మన్ & ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి రధోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీలు కొబ్బరి కాయ కొట్టి పూజలు నిర్వహించారు.
అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామివారి కళ్యాణోత్సవానంతరం వధూ వరులైన దేవతలు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారు ఉభయ దేవరులతో కలిసి రథోత్సవంలో పాల్గొనడం అంతర్వేది క్షేత్రంలో శతాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తుంది. మెరక వీధిలో ఉన్న రధాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్దారు. భక్తులు రథం చుట్టూ అరటి గెలలు కట్టి మ్రొక్కులు తీర్చుకున్నారు.
మెరకవీధి నుండి గుర్రాలక్క ఆలయం మీదుగా పంచాయతీ వీధి వరకు ఈ యాత్ర సాగింది. రధం వెంబడి భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందా గోవిందా నామస్మరణతో స్వామి వారిని స్మరించారు. దీంతో అంతర్వేది గోవిందా గోవిందా గోవిందా నామస్మరణ లతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా పోలీస్ వారు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారు సోదరి గుర్రాలక్కకు చీర - సారె అందించారు. స్వామివారి రథోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.